David Warner : వార్నర్ కి ఇంతటి అవమానమా..? అతడు ఏం చేశాడని ఇంతలా పగ బట్టారు..!

David Warner (PC: IPL)

David Warner : ఫేజ్ 2లో రెండు మ్యాచుల్లో ఆడిన డేవిడ్ వార్నర్, ఆ తర్వాత కొన్ని మ్యాచుల్లో స్టేడియంలో కూడా కనిపించలేదు. హోటల్ నుంచి స్టేడియానికి వచ్చి, జట్టును ఉత్సాపరిచేందుకు కూడా డేవిడ్ వార్నర్‌ను అనుమతించలేదని తెలిసింది.

 • Share this:
  ఐపీఎల్ 2021 సీజన్‌ (IPL 2021 Season Latest Updates) సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌ (Sunrisers Hyderabad)కి ఏ మాత్రం కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక, ఆ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) భావోద్వేగానికి గురయ్యాడు. హైదరాబాద్ జట్టుతో పాటు అభిమానులను మిస్ అవుతానని తెలిపాడు. ఇన్నాళ్లు అండగా నిలిచిన అభిమానులుకు సరిపడా కృతజ్ఞతలు చెప్పలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు వార్నర్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ను పంచుకున్నాడు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో వార్నర్‌కు చోటు దక్కుతుందని అందరూ భావించారు. డేవిడ్ వార్నర్‌కు ఇదే ఫేర్‌వెల్ మ్యాచ్ అనుకున్నారు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అతనికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్ గాయపడినా.. వార్నర్‌ను కాదని మనీశ్ పాండేను కెప్టెన్‌గా బరిలోకి దింపింది. దీంతో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌తో వార్నర్‌కు బేధాభిప్రాయాలు ఉన్నాయనే విషయం అర్ధమవుతోంది.

  మరోవైపు జట్టు పర్ఫామెన్స్ కంటే ఎక్కువగా డేవిడ్ వార్నర్‌కి జరిగిన పరాభవం, ఆరెంజ్ ఆర్మీ అభిమానులను మరింతగా బాధపెట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును సొంత టీమ్ కంటే ఎక్కువగా అభిమానించే డేవిడ్ వార్నర్‌ను సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది టీమ్ మేనేజ్‌మెంట్.ఆ తర్వాత అతనికి తుదిజట్టులో కూడా చోటు దక్కలేదు. ఫేజ్ 2లో రెండు మ్యాచుల్లో ఆడిన డేవిడ్ వార్నర్, ఆ తర్వాత కొన్ని మ్యాచుల్లో స్టేడియంలో కూడా కనిపించలేదు.

  హోటల్ నుంచి స్టేడియానికి వచ్చి, జట్టును ఉత్సాపరిచేందుకు కూడా డేవిడ్ వార్నర్‌ను అనుమతించలేదని తెలిసింది. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆఖరి రెండు మ్యాచుల సమయంలో స్టేడియంలో కనిపించాడు వార్నర్.

  తాజాగా ఐపీఎల్ 2021 సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆరెంజ్ ఆర్మీకి థ్యాంక్యూ చెబుతూ ఓ ఫేర్‌వెర్ వీడియోను రూపొందించింది. ఈ వీడియోలో కెప్టెన్ కేన్ విలియంసన్‌ నుంచి అందుబాటులో ఉన్న ప్లేయర్లు అందరూ కనిపించి, ఆరెంజ్ ఆర్మీ సపోర్ట్‌కి కృతజ్ఞతలు తెలిపారు.


  అయితే ఈ వీడియోలో డేవిడ్ వార్నర్ కనిపించలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ వీడియో పోస్టు చేసినా, ఏ ఫోటో పెట్టినా... దానికి స్పందించే వార్నర్ భాయ్, ఈ వీడియోకి కూడా స్పందించాడు. చాలామంది అభిమానులు, ఈ వీడియోలో డేవిడ్ వార్నర్ ఎందుకు లేడంటూ ప్రశ్నించారు. వారికి సమాధానం ఇచ్చిన వార్నర్... " ఇలా వీడియో చేయమని నన్ను ఎవ్వరూ అడగలేదు..." అంటూ రిప్లై ఇచ్చాడు.
  సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం ఎంతో చేసిన ఓ లెజెండరీ క్రికెటర్‌ని ఇంతలా అవమానించడం, టీమ్ మేనేజ్‌మెంట్‌కి ఏ మాత్రం భావ్యం కాదని అంటూ, ఆరెంజ్ ఆర్మీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. కేదార్ జాదవ్, ధోనీ వంటి ప్లేయర్లు గత సీజన్‌లో ఎంత ఘోరంగా ఫెయిల్ అయినా చెన్నై సూపర్ కింగ్స్ వారిని ఎక్కడా, ఏ విధంగానూ అవమానించలేదని, ఒక్క సీజన్‌లో పర్ఫామెన్స్ లేదని ఇలా చేస్తారా? ఓ ఆటగాడిని ఎలా గౌరవించాలో సీఎస్‌కేని చూసి నేర్చుకోవాలంటూ తిట్టిపోస్తున్నారు వార్నర్ భాయ్ ఫ్యాన్స్.


  ఇక 2013 సీజన్‌ నుంచి వరుసగా ప్రతి సీజన్‌లో 500 పరుగులకు పైగా పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌.. ఈ సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే సాధించి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చాంపియన్‌గా నిలిపిన డేవిడ్ భాయ్.. ఆ సీజన్‌లో 848 రన్స్ చేసి ఒంటి చేత్తో విజయాన్నందించాడు. అలాంటి ఆటగాడి పట్ల సన్‌రైజర్స్ యాజమాన్యం ప్రవర్తించిన తీరు ఏ మాత్రం బాలేదని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: