CSK vs MI: అద్భుత విజయంలో ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్... క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై చిత్తు...

సూర్యకుమార్ యాదవ్ 71 నాటౌట్... మూడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్... ఢిల్లీ, హైదరాబాద్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో తలబడనున్న ధోనీ టీమ్.

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 8, 2019, 7:46 AM IST
CSK vs MI: అద్భుత విజయంలో ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్... క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై చిత్తు...
సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ అభివాదం...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 8, 2019, 7:46 AM IST
IPL 2019 Live Score, CSK vs MI Match, Qualifier 1 at Chennai: చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రోహిత్ సేన ఘనవిజయం సాధించింది. ధోనీ సారథ్యంలోని చెన్నై టీమ్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసి, ఫైనల్ చేరింది. 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది ముంబై ఇండియన్స్. ఇన్నింగ్స్ తొలి బంతికే బౌండరీ బాదిన రోహిత్ శర్మ, రెండో బంతికి పెవిలియన్ చేరాడు. ఈ సీజన్‌లో 4 హాఫ్ సెంచరీలు చేసిన డి కాక్ కూడా 8 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే కుర్రాళ్లు ఇషాన్ కిషన్‌, సూర్యకుమార్ యాదవ్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి ముంబైని ఆదుకున్నారు. మూడో వికెట్‌కు ఈ జోడి 80 పరుగులు జోడించిన తర్వాత 28 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా డకౌట్ కావడంతో మళ్లీ ఉత్కంఠ రేగింది. అయితే హర్దిక్ పాండ్యాతో కలిసి లాంఛనాన్ని పూర్తిచేశాడు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ 54 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు చేయగా, హర్దిక్ పాండ్యా 13 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగుల స్వల్ప స్కోరు చేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఆరంభంలో గట్టి షాక్ తగిలింది. డుప్లిసిస్ 6 పరుగులు చేసి రాహుల్ చాహార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా, కొద్దిసేపటికే 5 పరుగులు చేసిన సురేశ్ రైనా, కొత్త కుర్రాడు జయంత్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది చెన్నై. ఆ తర్వాత 10 పరుగులు చేసిన షేన్ వాట్సన్‌ను కృనాల్ పాండ్యా అవుట్ చేశాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ దశలో కేదార్ జాదవ్ స్థానంలో చోటు దక్కించుకున్న మురళీ విజయ్‌తో కలిసి నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు అంబటి రాయుడు. ఇద్దరూ వికెట్లు కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో రన్‌రేట్ బాగా తగ్గింది. ఈ దశలో జోరు పెంచేందుకు ప్రయత్నించిన మురళీ విజయ్, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 26 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు మురళీ విజయ్. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ కూడా ప్రారంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా 18 ఓవర్లలో కేవలం 107 పరుగులు మాత్రమే సాధించగలిగింది చెన్నై సూపర్ కింగ్స్.

మలింగ వేసిన 19వ ఓవర్లో దూకుడు పెంచిన మహేంద్ర సింగ్ ధోనీ... రెండు వరుస సిక్సర్లు సాధించి 15 పరుగులు రాబట్టాడు. బుమ్రా వేసిన చివరి ఓవర్‌ మొదటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించిన ధోనీని...ఇషాన్ కిషన్ అద్భుత క్యాచ్‌తో అవుట్ చేశాడు. అయితే అది నో బాల్ కావడంతో ధోనీకి లైఫ్ లభించింది. అయితే చివరి ఓవర్‌లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్స్ సాధించేందుకు వీలుకాలేదు. చివరి ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే వచ్చాయి. ధోనీ 29 బంతుల్లో 3 సిక్సర్లతో 37 పరుగులు చేయగా, అంబటి రాయుడు 37 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 42 పరుగులు చేశాడు. ఈ విజయంతో ఐదోసారి ఐపీఎల్‌లో స్థానం సంపాదించుకుంది ముంబై ఇండియన్స్. క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఓడినప్పటికీ చెన్నైకి మరో అవకాశం దక్కుతుంది. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో తలబడనుంది ధోనీ టీమ్.

First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...