ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ (Badminton), రియో ఒలింపిక్స్‌లో రజత పతకం విజేత పీవీ సింధుకు (PV sindhu) ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) (IOA) షాకిచ్చింది. టోక్యో వేదికగా ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ (Tokyo Olympics) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి రోజు అన్ని దేశాలకు చెందిన అథ్లెట్లు ఒలింపిక్ పరేడ్‌లో పాల్గొంటారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత బృందానికి నాయకత్వం వహిస్తూ ఫ్లాగ్ బేరర్లుగా ఉండే వారిలో పీవీ సింధు కచ్చితంగా ఉంటుందని అందరూ ఊహించారు. అయితే ఐవోఏ మాత్రం బాక్సింగ్ చాంపియన్ మేరీ కోమ్(Mary Kom), భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ (Manpreet Singh) ఫ్లాగ్ బేరర్లుగా ఉంటారని ప్రకటించింది. గత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధుకు ఈ అవకాశం దక్కుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఐవోఏ మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నది. ఇక ముగింపు కార్యక్రమంలో ఫ్లాగ్ బేరర్‌గా స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా ఉంటారని ప్రకటించింది. రెండు కార్యక్రమాల్లో కూడా పీవీ సింధు పేరు లేకపోవడం బ్యాడ్మింటన్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఐవోఏ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు కూడా వస్తున్నాయి.
సాధారణంగా గత ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారికే సాధారణంగా ప్రారంభ, ముగింపు వేడుకల్లో పతాకధారులుగా అవకాశం కల్పిస్తారు. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజత పతకం, సాక్షి మాలిక్ కాంస్య పతకం గెలిచారు. అయితే సాక్షి మాలిక్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేక పోయింది. దీంతో గత ఒలింపిక్స్ రజత పతాక విజేత పీవీ సింధుకే అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మేరీ కోమ్, మన్‌ప్రీత్‌లకు అవకాశం కల్పించింది. లింగ సమానత్వం పాటించాలనే ఉద్దేశంతోనే ఒక మహిళ, మరొక పురుషుడికి పతకాధారులుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. గత ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్ర, సాక్షి మాలిక్‌లు పతాకధారులుగా వ్యవహరించారు.
బాక్సర్ మేరీ కోమ్ ఇప్పటికే 38 ఏళ్లకు చేరుకున్నది. టోక్యో ఒలింపిక్సే తనకు చివరి ఒలింపిక్స్ అని ఆమె ఇప్పటికే ప్రకటించింది. మేరీ కోమ్‌కు గౌరవంగా విడ్కోలు పలకాలని ఐవోఏ భావించి ఆమెకు అవకాశం కల్పించిన్లు తెలుస్తున్నది. ఇద్దరు పతాకధారుల్లో కేవలం ఒక మహిళకే ఛాన్స్ ఉండటంతో పీవీ సింధును పక్కకు పెట్టినట్లు తెలుస్తున్నది. 'నా కెరీర్‌లో పాల్గొంటున్న చివరి ఒలింపిక్స్‌లో దక్కిన గౌరవానికి చాలా సంతోషంగా ఉన్నది.ఐవోఏకు కృతజ్ఞతలు. మరో సారి పతకం సాధించేందుకు ప్రయత్నిస్తాను' అని మేరీ కోమ్ చెప్పింది. ఇక మరో పతాకధారిగా వ్యవహరిస్తున్న మన్‌ప్రీత్ సింగ్ తనకు దక్కిన ఈ గౌరవానికి మాటలు రావడం లేదని అన్నాడు. మేరీ కోమ్ లాంటి దిగ్గజ అథ్లెట్‌తో కలసి నడవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక ఒలింపిక్స్ పరేడ్‌లో పతాకధారిగా ఉన్న ఆరో హాకీ క్రీడాకారుడిగా మన్‌ప్రత్ గుర్తింపు పొందాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mary Kom, Pv sindhu, Tokyo Olympics