INVESTIGATION COMPLETED IN MATCH FIXING ALLEGATIONS ENGLAND AND AUSTRALIA MATCHES WITH INDIA WERE NOT FIXED SAYS ICC JNK
Match Fixing : ఇండియాతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టెస్టులు ఫిక్స్ అయ్యాయా? విచారణలో ఏమి తేలింది?
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో ఇండియా ఆడిన మ్యాచ్‌లపై ఐసీసీ విచారణ. (PC:ICC)
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో టీమ్ ఇండియా ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయని అల్‌జజీరా ఛానెల్లో ఒక డాక్యుమెంటరీ ప్రసారం అయ్యింది. దానిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన ఐసీసీ.. సోమవారం అవన్నీ ఆరోపణలే అని స్పష్టం చేసింది.
క్రికెట్ ప్రపంచానికి మ్యాచ్ ఫిక్సింగ్ (Match Fixing) అనే పెను భూతం ఎప్పుడూ వెన్నాడుతూనే ఉన్నది. గతంలో దుబాయ్, పాకిస్తాన్ కేంద్రంగా మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరిగేవి. కానీ ఇప్పుడు ఇండియాలోనే బుకీలు మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలు నడుపుతున్నారని స్వయంగా ఐసీసీ ఇటీవల తెలిపింది. క్రికెట్ మాత్రమే కాకుండా టెన్నిస్ మ్యాచ్‌లను కూడా ఇండియాకు చెందిన ఒక వ్యక్తి ఫిక్స్ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో (England)(Australia) జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయని అప్పట్లో దుమారం చెలరేగింది. ఆ రెండు జట్లతో కోహ్లీ సేన ఆడిన టెస్టులు ఫిక్స్ (Match Fix) అయినట్లు అల్‌జజీరా (Al Jazeera) న్యూస్ ఛానల్ ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. 2016లో చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్, 2017లో రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మరో మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ సదరు ఛానల్ 2018లో సదరు ఛానల్ ఒక డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. ఇందులో పలువురు మాజీ క్రికెటర్లు, ఒక బుకీ అభిప్రాయాన్ని కూడా చూపింది. ఈ డాక్యుమెంటరీపై సీరియస్ అయిన ఐసీసీ (ICC) వెంటనే నలుగురు స్వతంత్ర సభ్యులతో కూడిన విచారణ కమిటీతో దర్యాప్తుకు ఆదేశించింది,. బెట్టింగ్, క్రికెట్ విశ్లేషణలలో నిపుణులైన ఈ సభ్యులు డాక్యుమెంటరీపై సుదీర్ఘంగా విచారణ జరిపారు.
మ్యాచ్ ఫిక్స్ ఆరోపణలు వచ్చిన రెండు మ్యాచ్‌ల ఫుటేజీలను విచారణ బృందం నిశితంగా పరిశీంచింది. కొన్ని రోజుల పాటు ప్రతీ కెమేరా.. ప్రతీ ఆటగాడి కదలికలను పరిశీలించింది. సుదీర్ఘంగా విచారణ జరిపిన బృందం తమకు ఎలాంటి అనుమానాస్పద కదలికలూ కనపడలేదని స్పష్టం చేసింది. ఆ డాక్యుమెంటరీలో అనీల్ మునావర్ అనే బుకీ ఈ మ్యాచ్‌లు ఫిక్స్ అయినట్లు అనుమానాలు వ్యక్తం చేశాడు. అంతే కాకుండా గతంలో కూడా పలు మ్యాచ్‌లు ఇలాగే ఫిక్స్ అయ్యాయని చెప్పాడు. మరోవైపు డాక్యుమెంటరీలో తన అభిప్రాయాలను వెలువరించిన క్రికెటర్లు, బుకీలపై విచారణ కొనసాగించింది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజా, శ్రీలంక మాజీ క్రికెటర్లు తరంగ ఇండిక, తరిందు మెండిస్ వంటి వారు ఐసీసీ విచారణలో పాల్గొన్నారు. ముంబైకి చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రాబిన్ కడా ఈ డాక్యుమెంటరీలో తన అభిప్రాయాన్ని చెప్పాడు. అయితే ఐసీసీ విచారణలో మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదని తేల్చి చెప్పింది.
ICC has concluded its investigation into the documentary programme ‘Cricket’s Match Fixers’ broadcast by Al Jazeera.
డాక్యుమెంటరీలో తెలిపిన అభిప్రాయాలు అన్నీ కల్పితాలే అని. అవి నమ్మశక్య కాని విధంగా రూపొందించారని నిపుణుల బృందం వెల్లడించింది. మరోవైపు ఈ డాక్యుమెంటరీలో తమ అభిప్రాయాలను వెల్లడించిన క్రికెటర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐసీసీ స్పష్టం చేసింది. అసలు మ్యాచ్ ఫిక్సింగే జరగనప్పుడు ఇక విచారణను కొనసాగించడం కూడా అనవసరమని భావించింది. ఈ విషయంపై ఐసీసీ సోమవారం స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. డాక్యుమెంటరీ చిత్రీకరించిన వారిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐసీసీ స్పష్టం చేసింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.