INDvSL: రాహుల్ చాహర్‌పై ప్రశంసలు.. భువనేశ్వర్‌పై ఫైర్.. శిఖర్ ధావన్ ఏమంటున్నాడు?

రాహుల్ చాహర్‌పై ప్రశంసల జల్లు..(BCCI)

రెండో వన్డేలో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమై ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్ చూసిన వాళ్లు చాహర్‌ను పొగుడుతుండగా.. భువీని ట్రోల్ చేస్తున్నారు.

 • Share this:
  శ్రీలంక పర్యటనకు (Srilanka Tour) వెళ్లిన భారత జట్టు (Team India) రెండో పరాజయాన్ని మూటగట్టుకున్నది. వన్డే సిరీస్‌లో చివరి వన్డే ఓడినా సిరీస్ కైవసం చేసుకున్నది. అయితే టీ20 సిరీస్‌లో మాత్రం శ్రీలంక గట్టిపోటీని ఇచ్చింది. రెండో మ్యాచ్‌కే సిరీస్‌ను ఇండియా చేతిలో పెట్టకుండా కలసి వచ్చిన అవకాశాన్ని అందిపుచుకున్నది. అనుభవం ఉన్న ఆటగాళ్లు కరోనా కారణంగా ఐసోలేషన్‌కు వెళ్లిపోవడంతో.. కోచ్ రాహుల్ ద్రావిడ్ బెంచ్‌పై ఉన్న వారితో అరంగేట్రం చేయించి మ్యాచ్ ఆడించాడు. పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై శ్రీలంక బౌలర్లు మ్యాజిక్ చేశారు. భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే పరిమితం చేశారు. కెప్టెన్ ధావన్ (40), దేవ్‌దత్ పడిక్కల్ (29) పర్వాలేదనిపించారు. అయితే చివర్లో భువనేశ్వర్ కుమార్ 11 బంతులు ఆడినా భారీ షాట్లు కొట్టలేకపోయాడు. ఇక 133 పరుగులు ఛేదనలో శ్రీలంక జట్టు కూడా తడబడింది. భారత యువ క్రికెటర్లు అద్భుతమైన ఫీల్డింగ్‌తో శ్రీలంకను ముప్ప తిప్పలు పెట్టారు.

  యువ క్రికెటర్ రాహుల్ చాహర్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కు హైలైట్ అని చెప్పవచ్చు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ నాలుగో బంతిని భువనేశ్వర్ వేయగా ఫామ్‌లో ఉన్న అవిష్క ఫెర్నాండో భారీ షాట్ కొట్టాడు. బంతి కచ్చితంగా బౌండరీ దాటుతుంది అనుకున్నా అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ చాహర్ అద్భుతంగా క్యాచ్ చేశాడు. ముందు బంతిని పట్టిన చాహర్.. తన బ్యాలెన్స్ తప్పుతుందని గ్రహించి గాల్లోకి ఎగురవేసి బౌండరీ దాటాడు. మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి తిరిగి బంతిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్‌లు సర్వసాధారణంగా మారాయి. అయితే శ్రీలంక పర్యటనలో మాత్రం ఇదే తొలి రిలే క్యాచ్ కావడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు కూడా చాహర్ చాకచక్యాన్ని మెచ్చుకుంటున్నారు.

  అయితే మ్యాచ్ చివరి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. కానీ, భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్‌లో కరుణరత్నే భారీ సిక్స్ కొట్టాడు. అంతే కాకుండా ఆ ఓవర్‌లో సింగిల్స్, డబుల్స్ ద్వారా మరో ఆరు పరుగులు రాబట్టారు. దీంతో ఒక్క ఓవర్లోనే 12 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా.. ధనుంజయ, కరుణరత్నే వేగంగా వికెట్ల మధ్య పరుగులు తీసి విజయాన్ని అందించారు. అసలు సీనియర్ బౌలర్ అయిన భువీ అలా బౌలింగ్ చేయడంపై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అనే పేరున్న భువనేశ్వర్‌లో ఆ పస తగ్గిపోయిందని ట్రోల్ చేస్తున్నారు.

  ఓటమిపై శిఖర్ ధావన్ కూడా స్పందించాడు. తమ లైనప్‌లో ఒక బ్యాట్స్‌మాన్ తక్కువగా ఉండటం వల్ల పరుగులు రాబట్టలేకపోయామన్నాడు. స్లో వికెట్ కూడా తమ ఓటమికి ఒక కారణమని చెప్పుకొచ్చాడు. గురువారం జరిగే చివరి టీ20లో తప్పక రాణించి సిరీస్ కైవసం చేసుకుంటామని గబ్బర్ చెబుతున్నాడు.
  Published by:John Naveen Kora
  First published: