టీమ్ ఇండియాలోని (Team India) ప్రధాన ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ కోసం వెళ్లిన సమయంలో అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులు, యువకులను బీసీసీఐ (BCCI) శ్రీలంక పర్యటనకు (Srilanka Tour) పంపింది. అనుభవం ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) నేతృత్వంలోని టీమ్ ఇండియాతో ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో తొలి వన్డే (First ODI)ఆడనున్నది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, మహ్మద్ షమి వంటి కీలకమైన ఆటగాళ్ల గైర్హాజరీలో యువకులు, అనుభవం కలిగిన పరిమిత ఓవర్ల జట్టును శిఖర్ ధావన్ ఏ మేరకు నడిపించగలడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్లో రాణించిన యువకులు తొలి సారి భారత జాతీయ జట్టుకు ఎంపిపై.. విదేశీ పర్యటనకు వచ్చారు. తొలి సారి జట్టుకు ఆడుతున్న వీళ్లు ఒత్తిడిని ఏ మేరకు జయిస్తారనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొలంబోలో జరుగనున్న వన్డే వీరందరికీ తొలి పరీక్ష కానున్నది. శ్రీలంక పర్యటన కోసం ముంబైలో క్వారంటైన్ అయిన దగ్గర నుంచి ఆదివారం తొలి వన్డే ఆడటానికి మధ్యలో 31 రోజులు గడిచిపోయాయి. ఇందులో నాలుగైదు రోజులు మినహా ఎక్కువగా బయోబబుల్కే పరిమితం అయ్యారు. మైదానంలో ప్రాక్టీస్ చేసిన సమయం కంటే ఎక్కువగా హోటల్ రూమ్‌లలోనే గడిపారు. దీంతో వీరి మానసిక స్థితిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నది. అందుకే తొలి వన్డేపై అందరి చూపు ఉన్నది.
భారత జట్టుకు ఎప్పుడూ బ్యాటింగ్ ప్రధాన బలం. ఇప్పుడు శ్రీలంక వెళ్లిన పరిమిత ఓవర్ల జట్టుకు కూడా అదే బలం కాబోతున్నది. భారత జట్టు వన్డే, టీ20 రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలసి పృథ్వీ షా ఓపెనింగ్ చేయబోతున్నాడు. శిఖర్ ధావన్ చివరి సారిగా ఇంగ్లాండ్‌తో పూణేలో జరిగిన సిరీస్‌లో ఆడాడు. మూడు వన్డేల్లో రెండు అర్దసెంచరీలు బాది మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఒక వన్డేలో 98 పరుగులు చేసిన ధావన్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఇక పృథ్వీషా చక్కని ఓపెనర్ అన్న విషయం తెలిసిందే. గతంలో విదేశీ పర్యటనల్లో విఫలమయ్యాడన్న కారణంతో అతడిని పక్కన పెట్టారు. అయితే ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడిన పృథ్వీషా తన టెన్నిక్ సరి చేసుకొని రాణించాడు. కరోనా కారణంగా అర్దాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ధావన్‌తో కలసి ఓపెనింగ్ చేశాడు. వీరిద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతాడని ఇప్పటికే ధావన్ చెప్పాడు. దేశవాళీ, ఐపీఎల్లోరాణించిన అనుభవం సూర్యకుమార్‌కు పనికి వస్తుంది. ఆ తర్వాత స్థానంలో మనీష్ పాండే ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో భారత జట్టుకు ఆడిన అనుభవం పాండేకు ఉపయోగపడనున్నది. లోయర్ మిడిల్/ఫినిషర్‌గా పాండ్యా బ్రదర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యాకు శ్రీలంక సిరీస్ చాలా కీలకమైనది. బౌలింగ్ చేయలేకపోతున్నాడనే విమర్శల నేపథ్యంలో తనని తాను నిరూపించుకోవల్సి ఉన్నది.
కృనాల్ పాండ్యా కూడా వన్ వన్డే వండర్లా మిగిలి పోకుండా మరిన్ని కీలక ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేయడంతో పాటు బంతితో కూడా రాణించాల్సిన అవసరం ఉన్నది. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ లేదా సంజూ శాంసన్లోఒకరికి అవకాశం లభిస్తుంది. అయితే గతంలో టీమ్ ఇండియా తరపున ఆడిన శాంసన్ అవకాశం దక్కించుకునే అవకాశం ఉన్నది. యువ క్రికెటర్లు దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు తుది జట్టులో స్థానం కోసం మరి కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.
బౌలింగ్ విభాగంలో భారత జట్టు మంచి అనుభవం కలిగి ఉన్నది. వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్‌కు తోడుగా దీపక్ చాహర్ లేదా శార్దుల్ ఠాకూర్ బరిలోకి దిగవచ్చు. నవదీప్ సైనీ రూపంలో మరో బౌలర్ కూడా అందుబాటులో ఉన్నాడు. ఇక స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్ - యజువేంద్ర చాహల్ చాలా రోజుల తర్వాత కలసి ఒకే వన్డేలో బరిలోకి దిగనున్నారు. వీరిద్దరి అనుభవం మిడిల్ ఓవర్లలో తప్పక ఉపయోగపడనున్నది. రాబోయే టీ20, వన్డే వరల్డ్ కప్‌లలో చోటు కోసం వీరికి ఈ పర్యటన కీలకంగా మారనున్నది. మరోవైపు శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు కోల్పోయింది. అయితే స్వదేశంలో ఆడుతుండటం వారికి కలసి వచ్చే అంశం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.