ఫుట్ బాల్ మ్యాచ్... స్టేడియం ఫుల్ !

ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ ఇటు భారత్‌లోని ఫుట్‌బాల్ క్రీడాభిమానులను కూడా వదిలిపెట్టడం లేదు.

Chinthakindhi.Ramu | news18
Updated: June 6, 2019, 2:23 PM IST
ఫుట్ బాల్ మ్యాచ్... స్టేడియం ఫుల్ !
India's Football Match In Mumbai Sold Out After Sunil Chhetri's Heartfelt Plea
  • News18
  • Last Updated: June 6, 2019, 2:23 PM IST
  • Share this:
భారతీయుల జాతీయ క్రీడ హాకీ అయినా... క్రికెట్ అంటేనే పడి చచ్చిపోతారు ఇక్కడి జనాలు. క్రికెటర్లకి బాలీవుడ్ స్టార్ హీరోలకి మించిన ఇమేజ్, పాపులారిటీ ఉంటుందంటే... క్రికెట్ మీద ఉండే మోజు ఏ రేంజులో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ కేవలం పురుషుల క్రికెట్ కి ఉన్న ఆదరణ, మహిళల క్రికెట్ కి ఉండదు. అయితే ఈ మధ్య పరిస్థితి కాస్త మారుతోంది. మమ్మల్ని కూడా కాస్త గుర్తించండంటూ ఫుట్ బాల్ ప్లేయర్ కమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ విన్నపం మన్నించారేమో... తాజాగా 7న జరగబోయే ఫుట్ బాల్ మ్యాచ్ టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి.

ఫుట్ బాల్ మ్యాచ్ కి టికెట్లు మొత్తం అమ్ముడవ్వడమంటే చాలా పెద్ద విశేషమే. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఒక్క క్రికెట్ స్టేడియం, కబడ్డీ గ్రౌండ్ వంటివి తప్పితే మిగిలిన ఆటలను మనవాళ్లు పట్టించుకున్నది లేదు. వరల్డ్ వైడ్ పిచ్చి క్రేజ్ ఉన్న ఫుట్ బాల్ గురించి అయితే మరీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మనవాళ్లకి ఫుట్ బాల్ అంటే పెద్దగా ఆసక్తి లేక కాదు. సాకర్ ఫుట్ బాల్ మ్యాచులు జరిగినప్పుడు నిద్ర మానుకుని మరీ... అర్ధరాత్రి మ్యాచులు చూసేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే బ్రెజిల్, జర్మనీ వంటి సాకర్ ఫివర్ ఎక్కువగా ఉన్న దేశాలు ఆడుతున్నప్పుడు ఉండే ఆసక్తి మన జట్టు ఆడుతున్నప్పుడు అస్సలు కనిపించదు.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మనవాడు సునీల్ ఛెత్రీ ఉన్నాడనే విషయం కూడా చాలామందికి తెలియదు. 61 గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్ బాల్ ప్లేయర్ల లిస్టులో లెజెండరీ రోనాల్డో, మెస్సీ వంటి టాప్ స్టార్ల తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు భారత ఫుట్ బాల్ టీం కెప్టెన్ సునీల్ ఛెత్రీ. ఇదే ఆటగాడు మరో దేశంలో పుట్టినట్టయితే అతనికి ఇచ్చే గుర్తింపు, గౌరవం వేరేగా ఉండేది. ఇండియాలో కనీస గుర్తింపు కూడా కరువైంది. ఇదే సునీల్ ఛెత్రీని తీవ్రంగా బాధపెట్టింది. దాంతో ఈ మధ్య ‘స్టేడియానికి రండి... మా ఆట చూడండి. బాగా ఆడకపోతే తిట్టండి... గోల చేయండి. ఏదో ఒకరోజు మీరు కోరుకునే స్థాయిలో ఆడతాం...’ అంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో ద్వారా ప్రేక్షకులను వేడుకున్నాడు సునీల్.

సునీల్ అభ్యర్థన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. క్రికెట్ దేవుడిగా ఆరాధించే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సునీల్ ఛెత్రీకి అనుకూలంగా వీడియోలు పోస్టు చేశారు. ‘మనదేశం తరుపున ఆడుతున్న జట్టును ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని’ గుర్తుచేశారు. దీంతో అందరి చూపు ఫుట్ బాల్ మ్యాచ్ పై పడింది. ఇంటర్ కాంటినెంటల్ కప్ లో భాగంగా నిన్న కెన్యాతో తలపడింది భారత ఫుట్ బాల్ జట్టు. ఈ మ్యాచ్ సునీల్ ఛెత్రీకి నూరో మ్యాచ్ కావడం కూడా విశేషం. తన 100వ మ్యాచ్ లో రెండు గోల్స్ సాధించాడు సునీల్ ఛెత్రీ. వర్షం పడుతున్నా, వాతావరణం ఆటంకాలు కలిగిస్తున్నా జరిగిన ఈ మ్యాచులో మొత్తం మూడు గోల్స్ సాధించి 3-0 తేడాతో కెన్యాని ఓడించింది భారత జట్టు. జెజె లాల్ ఒక గోల్ చేశాడు. ఈ మ్యాచ్ కి 2,569 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచులో భారత్ విజయం సాధించడంతో గురువారం న్యూజిలాండ్ తో భారత్ తలపడే మ్యాచ్ పై అంచనాలు పెరిగాయి. ముంబైలో జరిగే ఈ మ్యాచ్ టికెట్లు మొత్తం ఇప్పటికే అమ్ముడయ్యాయని సమాచారం. దాదాపు 15 వేల మంది సామర్థ్యం ఉన్న స్టేడియం మొత్తం బ్లూ జెర్సీలతో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే మాత్రం భారత్ ఫుట్ బాల్ దశ తిరిగినట్టే! అంతేకాకుండా ఈ విజయంతో భారత్ తన ర్యాంకింగ్ కూడా మెరుగుపరుచుకుని 97వ ర్యాంకుకి చేరుకుంది. గురువారం మ్యాచులో గెలుపు సాధిస్తే మాత్రం భారత్ కెప్టెన్ ఆశించిన ఆదరణ త్వరలోనే లభించడం ఖాయం. వచ్చే ఏడాది యూఏఈలో జరిగే ఆసియా కప్ సన్నాహకంగా ఈ ఇంటర్ కాంటినెంటల్ కప్ నిర్వహిస్తున్నారు.
Published by: Ramu Chinthakindhi
First published: June 5, 2018, 5:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading