Indian Football Team : విస్తీర్ణంలో భారత్ (India) కంటే చిన్ని చిన్న దేశాలు ఫుట్ బాల్ (Foot Ball)లో అదరగొడుతున్నాయి. 13 కోట్ల జనాభా ఉన్న జపాన్ (Japan) ఫుట్ బాల్ ప్రపంచంలో బలమైన జట్టుగా ఉంది. ఏళ్లు గడుస్తున్నా భారత్ ఫుట్ బాల్ ఆట మాత్రం మారడం లేదు. 92 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఏనాడూ భారత్ నేరుగా అర్హత సాధించలేకపోయింది. బ్రెజిల్ వేదికగా 1950లో జరిగిన ప్రపంచకప్‌లో పాల్గొనాలని భారత్‌కు ఆహ్వానం లభించినా పలు కారణాలతో వెళ్లలేకపోయింది. అయితే 1950-70 మధ్య్ కాలాన్ని భారత ఫుట్ బాల్ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. 1956 మెల్ బోర్న ఒలింపిక్స్ లో ఏకంగా నాలుగో స్థానంలో నిలిచి సంచలన ప్రదర్శన చేసింది. 1964 ఆసియా కప్ లో రన్నరప్ గా నిలిచింది. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో రహీమ్ శిక్షణలో భారత జట్టు ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించింది.
అయితే 1970 నుంచి ఇండియన్ ఫుట్ బాల్ జట్టు ఆట గతి తప్పింది. ఒకప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన భారత్.. ఆ తర్వాతి కాలంలో పేలవ టీంగా మారిపోయింది. భైచుంగ్ భూటియా లాంటి ప్లేయర్లు మెరిశారే తప్ప టీమిండియాను ప్రపంచకప్ కు అర్హత సాధించలేకపోయారు. ఇండియాలో ఫుట్ బాల్ సక్సెస్ కాకపోవడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వయసు : 21 ఏళ్ల వయసులో భారత ప్లేయర్లు ప్రొఫెషినల్ ఫుట్ బాల్ ప్లేయర్లుగా మారుతున్నారు. ఫుట్ బాల్ అనేది శారీరక శ్రమతో కూడుకున్నది. ఇతర దేశాల్లో 16 నుంచి 18 ఏళ్ల వయసులోనే ప్రొఫెషినల్ ఫుట్ బాల్ ప్లేయర్లుగా మారుతుంటే.. ఇండియాలో మాత్రం 21 ఏళ్లుగా ఉంది. తాజాగా జరిగిన ఖతర్ ప్రపంచకప్ లో స్పెయిన్ కు చెందిన గావి వయసు కేవలం 18 ఏళ్లు.
ఆర్థిక పరిస్థితులు : భారత ఫుట్ బాల్ ప్లేయర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఫుట్ బాల్ ద్వారా వీరంతా కూడా అరకొరకగానే సంపాదిస్తున్నారు. ఫుట్ బాల్ క్రీడలో ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అనుకోని ప్రమాదం జరిగితే కెరీర్ ముగిసే అవకాశం ఉంటుంది.
సదుపాయాలు : ఫుట్ బాల్ ఆట శారీరక శ్రమతో పాటు టెక్నికల్ అనాలసిస్ ను కలిగి ఉండే క్రీడ. తాము గొప్పగా ఆడితే సరిపోదు ప్రత్యర్థుల ఆటను కూడా తెలుసుకోవాలి. జిమ్ లు, వీడియో అనాలసిస్ చేసే పరికరాలు, ఆటగాళ్ల డైట్ వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. అయితే వీటి విషయంలో ఇప్పుడిప్పుడే మార్పులు కనిపిస్తున్నాయి. ఇది శుభ సూచకం.
స్పందన కరువు : భారత్ లో ఫుట్ బాల్ కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కేరళ , బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే ఫుట్ బాల్ కు క్రేజ్ ఉంది. భారత్ లో జరిగే మ్యాచ్ లు ఖాళీ స్టేడియాల్లో జరుగుతుంటాయి. ఒక సమయంలో సునీల్ ఛెత్రి ఈ విషయంలో బాధ పడ్డాడు కూడా. స్టేడియంకు వచ్చి తమకు మద్దతు పలకండి అంటూ అభిమానులను గతంలో ఒకసారి వేడుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీ జనాలు లేక ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్ లు జరుగుతున్నాయి.
చెప్పుకోదగ్గ గెలుపు లేదు : 1983 ప్రపంచకప్ ట్రోఫీని గెలవడంతో దేశంలో ఒక్కసారిగా క్రికెట్ కు ఎనలేని క్రేజ్ వచ్చింది. సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోని, యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్లు క్రికెట్ కు మరింత వైభవాన్ని తీసుకువచ్చారు. అయితే ఫుట్ బాల్ లో మాత్రం భారత్ చెప్పుకోదగ్గ గెలుపును సాధించలేకపోయింది. కనీసం ఆసియా కప్ ను కూడా గెలవడంలో సక్సెస్ కాలేదు.
క్రికెట్ : దేశంలో క్రికెట్ కు విపరీతమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ రాకతో ఈ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. క్రికెట్ ఆడితే వచ్చే క్రేజ్.. ఫుట్ బాల్ ఆడితే రావడం లేదు. దాంతో చాలా మంది పిల్లలు క్రికెట్ వైపు అడుగులు వేస్తున్నారు.
అయితే భారత ఫుట్ బాల్ లో ఇప్పుడిప్పుడే మార్పులు మొదలయ్యాయి. క్రొయేషియా కోచ్ ఇగోర్ స్టిమాక్ పర్యవేక్షణలో భారత్ నిలకడైన ప్రదర్శన చేస్తుంది. 2026లో జరిగే ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో 48 జట్లు పాల్గొనే అవకాశం ఉండటంతో మెగా ఈవెంట్ కు అర్హత సాధించడానికి భారత్ కు ఒక మంచి అవకాశం వచ్చింది. వచ్చే రెండేళ్లు భారత్ ఫుట్ బాల్ కు అత్యంత ముఖ్యమైన రోజులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, FIFA World Cup 2022, Football, India, Team India