శ్రీలకంతో జరిగిన తొలి టీ20లో యంగ్ ఇండియా బోణీ చేసింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించింది. మొదట బ్యాటింగ్ లో సూర్య కుమార్ యాదవ్ రాణింపుంతో 165 పరుగుల లక్ష్యం పెట్టిన యువ భారత్.. తరువాత బౌలింగ్ లోనూ మెరిసింది. అంతా కలిసి కట్టుగా రాణించడంతో శ్రీకలం 126 పరుగులకే ఆలౌట్ అయ్యింది.. దీంతో భారత్ 38 పరుగుల తేడాతో తొలి టీ 20ను సొంతం చేసుకుంది. ఇటీవల వన్డే సిరీస్ ను యువ భారత జట్టు 2-1తేడాతో సొంతం చేసుకుంది. ఇప్పుడు టీ20 సిరీస్ లోనూ మంచి శుభారంభం చేసింది. భారత బౌలర్లలో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించాడు. భారత జట్టును గెలిపించడంలో కీ రోల్ పోషించాడు. మొదట నిలకడగా ఆడుతున్నట్టు కనిపించిన శ్రీలంక గెలుపు ఈజీ అనుకున్నారు అంతా.. కానీ చివరిలో కేవలం 15 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక చేజేతులా మ్యాచ్ ఓడింది. లంక ఆటగాళ్ల అనుభవ రాహిత్యం బయటపడింది.
మ్యాచ్ ను ములుపు తిప్పింది అదే.. మొదట 165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 15 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. అంటే అప్పటికే 30 బంతుల్లో 58 పరుగులు మాత్రమే చేయాలి.. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. అంతా లంక గెలుపు నల్లేరుపై నడకే అనుకన్నారు. ఎందుకంటే అప్పటికే చారిత్ అసలంక 44 పరుగులతో ఫాంలో ఉన్నాడు. 16వ ఓవర్ లో దీపక్ చాహర్.. మూడో బంతికి అసలంకను.. ఐదో బంతికి హసరంగాను ఔట్ చేసి.. మ్యాచ్ ను టర్న్ చేశాడు. దీంతో అప్పటి వరకు భారత్ బౌలర్లపై ఉన్న ఒత్తిడి పూర్తిగా పోయింది. లంక జట్టు 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత తన అనుభవాన్ని ఉపయోగించిన భువనేశ్వర్ కుమార్ వరుస వికెట్లతో లంక బ్యాట్స్ మెన్ పై విరుచుకుపడ్డాడు. ఓవారాల్ గా నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. వన్డేల్లో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. శిఖర్ ధావన్ 46 పరుగులతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగ రెండు వికెట్లతో సత్తా చాటాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అతిధ్య లంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.
టీ20 క్రికెట్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే అరంగేట్రం ఆటగాడు పృథ్వీ షా డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ ఔట్ తో ధోనీ, రాహుల్ సరసన రికార్డుల్లో చేరాడు పృథ్వీ షా. చమీరా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ భానుకకు క్యాచ్ ఇచ్చి షా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ ధావన్ తో కలిసిన సంజూ శామ్సన్ వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాది.. శ్రీలంక బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అయితే.. ఎప్పుడూ తనకున్న అలవాటుతోనే మంచి స్కోరు చేసే అవకాశం ఉన్నా.. చేజాతులరా వికెట్ జార్చుకున్నాడు శామన్స్. ధనంజయ వేసిన ఆరో ఓవర్‌లో సిక్స్, ఫోర్ సహా మొత్తం 16 పరుగులు పిండుకున్న సామ్సన్(20 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్).. 7 ఓవర్ తొలి బంతికే ఔటయ్యాడు. హసరంగ బౌలింగ్‌లో సామ్సన్.. వికెట్ల ముందు చిక్కాడు. మరో ఎండ్ లో ధావన్.. ఆచి తూచి ఆడుతూ.. చెత్త బంతుల్ని బౌండరీ తరలించాడు. ధావన్ తో కలిసిన సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ ను కొనసాగిస్తూ.. చెలరేగాడు. ఈ క్రమంలో ధావన్, సూర్య కుమార్ యాదవ్ 62 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్ సెంచరీ కి చేరువుతున్న ధానన్ కరుణరత్నే బౌలింగ్ లో బండారాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. గబ్బర్..36 బంతుల్లో 46 పరుగులు చేశాడు.
సూర్య కుమార్ యాదవ్ .. వన్డేల్లోని ఫామ్ ను కంటిన్యూ చేస్తూ హాఫ్ సెంచరీ బాదాడు. అయితే, ఆ తర్వాత బంతికే అనవసరపు షాట్ కు యత్నించి పెవిలియన్ బాట పట్టాడు. హసరంగ బౌలింగ్ లో రమేశ్ మెండిస్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 127 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ తో టీమిండియా ఈ స్కోరు సాధించింది. మరోసారి హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ తో నిరాశపర్చాడు. 12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. ఇషాన్ కిషన్ 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగగా.. యువ ఓపెనర్ పృథ్వీ షా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 అరంగేట్రం చేశారు. కాగా, లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీ 20 సిరీస్ లో ఇప్పటికే బోణీ కొట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.