INDIA VS WEST INDIES T20 YOUNG INDIA LIMBER UP TO FACE T20 SPECIALISTS WEST INDIES NK
IND vs WI : నేడు భారత్, వెస్టిండీస్ టీ20... పరుగుల వరదే...
టీమ్ ఇండియా, వెస్టిండీస్ జట్టు (Image : Twitter / BCCI)
India vs West Indies : వరల్డ్ కప్‌లో వర్షం వల్ల ఓటమి పాలైన టీంఇండియా... ఆ గాయాన్ని మర్చిపోయే సమయం వచ్చింది. విండీస్‌తో 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. ఇవాళ ఫ్లోరిడాలో మొదటి టీ20 రాత్రి 8 గంటలకు మొదలవ్వబోతోంది.
India vs West Indies T20 : టీమిండియా కచ్చితంగా ప్రపంచకప్ గెలుస్తుందని కోట్ల మంది అభిమానులు ఆశించారు. కానీ... వర్షం దెబ్బేసింది. అయ్యిందేదో అయ్యింది అనుకుంటూ కోహ్లీ టీమ్... వెస్టిండీస్‌తో సుదీర్ఘ టూర్ ప్రారంభించింది. అభిమానులకు తిరిగి పరుగుల విందు అందించేందుకు విరాట్ కోహ్లీ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉండగా... తడాఖా చూపిస్తామంటూ చెలరేగిపోయేందుకు కెప్టెన్ బ్రాత్‌వైట్ టీమ్ కూడా సిద్ధమైంది. అందువల్ల తొలి టీ20 నుంచే పరుగుల వరద పారేలా కనిపిస్తోంది. ప్రధానంగా టీ-20లో పరుగులే కీలకం. దీన్ని దృష్టిలో పెట్టుకొని... భారత యువ ఆటగాళ్లు... ఫుల్ ప్రాక్టీస్ చేశారు. వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ కుప్పకూలినా... ఈసారి మాత్రం కచ్చితంగా అభిమానుల అంచనాల్ని అందుకుంటామంటోంది. అదే సమయంలో... టీ-20ల్లో మెరుగైన రికార్డ్ ఉన్న విండీస్ కూడా... తొలి మ్యాచ్ నుంచే పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉంది.
నిజానికి ఈ టూర్‌ని ఓ రిహార్సల్స్‌లా టీమ్ ఇండియా భావిస్తోంది. ఎందుకంటే వరల్డ్ కప్ కోల్పోయిన బాధ నుంచీ వచ్చే ఏడాది జరిగే టీ-20 కప్ కచ్చితంగా గెలవాలనే కసితో ఉన్నారు ఆటగాళ్లు. పైగా ప్రస్తుతం భారత జట్టు కుర్రాళ్లతో ఫుల్ జోష్‌లో దూకుడు మీద ఉంది. ఈ ఊపులో, ఇదే జోరు కొనసాగిస్తే... కనీసం టీ20 కప్ అయినా దక్కుతుంది. పైకి కోహ్లీ టీమ్ అంతా బాగున్నట్లే కనిపిస్తున్నా... తెరవెనక మాత్రం సమన్వయ లోపం కనిపిస్తోంది. ప్రధానంగా కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మకు సెట్ కావట్లేదు. ఇద్దరూ చెరో దారి పడుతున్నారు. వీళ్లిద్దరూ కలిస్తేనే జట్టుకు బలం అంటున్నారు విశ్లేషకులు.
ఇవాళ్టి మ్యాచ్‌లో రాహుల్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, నవ్‌దీప్ సైనీ, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ వంటి యువ ఆటగాళ్లు ఛాన్స్ తీసుకుంటుండగా... విండీస్ నుంచీ పొలార్డ్, నరైన్, పూరన్, బ్రాత్‌వైట్... స్కోర్ బోర్డును పరిగెత్తించేలా కనిపిస్తున్నారు. గేల్ మాత్రం ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. టీమ్ ఇండియా ఈ సిరీస్‌ని ప్రయోగంగా భావించడానికి కారణం ఇటీవల టీ ట్వంటీల్లో భారత్ ప్రదర్శన అంతంత మాత్రంగా ఉండటమే. న్యూజిలాండ్ టూర్లో 1-2తో సిరీస్ కోల్పోయిన మన జట్టు... స్వదేశంలో ఆస్ట్రేలియా చేతిలో 0-2తో వైట్ వాష్ అయ్యింది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఓపెనర్‌గా శిఖర్ ధావన్ ఫామ్‌లోకి వచ్చేలా ఉన్నా... మిడిల్ ఆర్డర్ రాణిస్తుందా, లేదా అన్నది సమస్యగా ఉంది. ముఖ్యంగా అత్యంత సమస్యగా మారిన నాలుగో నెంబర్లో రాహుల్ లేదా కోహ్లీ బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. విండీస్ మాత్రం... ఎట్టిపరిస్థితుల్లో ఇవాళ్టి మ్యాచ్‌లో కచ్చితంగా భారత్‌ను ఓడించి తీరతామని ప్రకటించింది. అందువల్ల ఈ సిరీస్‌పై ఆసక్తి, అంచనాలూ పెరిగాయి.