Home /News /sports /

INDIA VS WEST INDIES FIRST ODI LIVE CROCKET SCORE UPDATES FROM AHMEDABAD NARENDRA MODI STADIUM TEAM INDIA WON BY 6 WICKETS SRD

IND vs WI : థౌజండ్ వాలా వన్డే టీమిండియాదే.. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్..

Rohit Sharma (PC : BCCI)

Rohit Sharma (PC : BCCI)

IND vs WI : ప్ర‌తిష్టాత్మ‌క 1000వ వ‌న్డేలో టీమిండియా అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేలో టీమిండియా విక్టరీ కొట్టింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

    ప్ర‌తిష్టాత్మ‌క 1000వ వ‌న్డేలో టీమిండియా అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేలో టీమిండియా విక్టరీ కొట్టింది. విండీస్ విధించిన 177 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 28 ఓవర్లలో ఛేజ్ చేసింది. మరో 132 బంతులు మిగిలుండగానే టీమిండియా టార్గెట్ ను అందుకుంది. రోహిత్ శర్మ (51 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌ 60 పరుగులు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ కిషన్ ( 28 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ ( 34 పరుగులు నాటౌట్), దీపక్ హుడా ( 26 పరుగులు నాటౌట్) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో అల్జెరీ జోసెఫ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఈ విక్టరీతో మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 177 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ కలిసి టీమిండియాకి శుభారంభం అందించారు.

    తొలి వికెట్‌కి 84 పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 51 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో వస్తూనే రెండు ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ, 4 బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత.. 36 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన ఓపెనర్ ఇషాన్ కిషన్, అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో ఫ్యాబియన్ ఆలెన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

    ఆదుకుంటాడనుకున్న రిషబ్ పంత్, 9 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఒకానొక దశలో 84/0 స్కోరుతో ఉన్న భారత జట్టు, వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయి 116/4 స్థితికి చేరుకుంది. అయితే, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా సమయస్పూర్తితో ఆడి లక్ష్యాన్ని ఛేజ్ చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 62 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు.


    ఇక, అంతకుముందు క‌లిసిక‌ట్టుగా బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు కరేబియ‌న్ల‌ను స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమితం చేశారు. ముఖ్యంగా భార‌త స్పిన్న‌ర్లు య‌జుర్వేంద్ర చాహ‌ల్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ధాటికి క‌రేబియ‌న్లు క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. వీరికి పేస‌ర్లు మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ కూడా తోడ‌వ‌డంతో వెస్టిండీస్ స్వ‌ల్ప స్కోర్‌కే ప‌రిమితం అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఏ ద‌శ‌లోనూ మంచి స్కోర్ సాధించేలా క‌నిపించ‌లేదు. టీమిండియా బౌల‌ర్లు విజృంభించ‌డంతో వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది.

    ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు చేసిన‌ విండీస్ ఓపెన‌ర్ షాయ్ హోప్‌ను హైద‌రాబాద్‌ బౌల‌ర్ మహ్మ‌ద్ సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో వెస్టిండీస్ 18 ప‌రుగుల‌కే తొలి వికెట్ కోల్పోయింది. అనంత‌రం జ‌ట్టు స్కోర్ 44 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా మ‌రో ఓపెన‌ర్ బ్రాండన్ కింగ్(13)ను వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఔట్ చేశాడు. అదే ఓవ‌ర్‌లో డారెన్ బ్రావో (18)ను కూడా సుంద‌ర్ ఎల్బీ రూపంలో ఔట్ చేశాడు.

    ఆ తర్వాత బౌలింగ్‌కు వ‌చ్చిన చాహ‌ల్ చెల‌రేగాడు. వ‌రుస ఓవ‌ర్ల‌లో నికోల‌స్ పూర‌న్ (18), కీర‌న్ పొలార్డ్‌, బ్రూక్స్‌ను ఔట్ చేశాడు. చాహ‌ల్ ధాటికి వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. అంతేకాకుండా ఈ వికెట్ల‌తో వ‌న్డే క్రికెట్లో చాహ‌ల్ 100 వికెట్ల క్ల‌బ్‌లో చేరాడు. 60 వ‌న్డేల్లో 100 వికెట్లు తీసిన చాహ‌ల్.. అత్యంత వేగంగా ఈ జాబితాలో చేరిన రెండో భార‌త స్పిన్‌ బౌల‌ర్‌గా నిలిచాడు. మొత్తంగా ఐదో భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు.

    ఆ వెంట‌నే అకేల్ హోసేన్‌ను ప్ర‌సిద్ద్ కృష్ణ డ‌కౌట్ చేయ‌డంతో 79 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. దీంతో విండీస్ 100 ప‌రుగులు కూడా సాధించేలా క‌నిపించలేదు. అయితే ఈ క్ర‌మంలో ఆల్‌రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్‌, ఫాబియన్ అలెన్ వెస్టిండీస్‌ను ఆదుకున్నారు. వీరిద్ద‌రు ఎనిమిదో వికెట్‌కు 78 ప‌రుగుల మంచి భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్ర‌మంలో ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడిని 37వ ఓవ‌ర్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ విడ‌దీశాడు. 29 ప‌రుగులు చేసిన ఫాబియన్ అలెన్‌ను ఔట్ చేశాడు.

    అయితే 57 ప‌రుగులు చేసిన హోల్డ‌ర్‌ను ప్రసిద్ధ్ కృష్ణ ఫెమిలియ‌న్ పంపాడు. దీంతో వెస్టిండీస్ 167 ప‌రుగుల వ‌ద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. చివ‌రి వికెట్‌గా 13 ప‌రుగులు చేసిన జోసెఫ్‌ను చాహ‌ల్ ఔట్ చేశాడు. దీంతో 43.5 ఓవ‌ర్ల‌లో వెస్టిండీస్ 176 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ ముందు క‌రేబియ‌న్లు 177 ప‌రుగుల‌ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని మాత్ర‌మే ఉంచగ‌లిగారు. భార‌త బౌల‌ర్ల‌లో చాహ‌ల్ 4, వాషింగ్ట‌న్ సుంద‌ర్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటారు. మ‌హ్మ‌ద్ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IND vs WI, India Vs Westindies, Rohit sharma, Team India, Virat kohli

    తదుపరి వార్తలు