India vs srilanka: వచ్చే నెలలో శ్రీలంక (Srilanka)తో జరిగే టెస్టు సిరీస్ కోసం భారత (Team India) జట్టును బీసీసీఐ (BCCI) శనివారం ప్రకటించింది. అందరూ అనుకున్నట్లే విరాట్ కోహ్లీ వదిలేసిన టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ (Rohit sharma)కు అప్పగించేసింది. అంతేకాకుండా టెస్టు, టి20 జట్లకు భారత స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah)ను వైస్ కెప్టెన్ గా నియమించింది. రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం భారత్ 18 మందితో జట్టును ప్రకటించగా... కొత్త ముఖాలు ప్రియాంక్ పాంచల్, సౌరభ్ వర్మలు జట్టులో చోటు దక్కించుకున్నారు. అదే సమయంలో గత కొంతకాలంగా ఫామ్ లో లేక ఇబ్బంది పడుతూ జట్టుకు భారంగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లపై వేటు వేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరిద్దరి ఆట దాదాపుగా ముగిసినట్లే అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే వీరిపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ (sunil gavaskar) కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అజింక్యా రహానే (Ajinkya rahane), చతేశ్వర్ పుజారా (cheteshwar pujara) గత కొన్నేళ్ల పాటు భారత టెస్టు జట్టుకు మూల స్థంభంగా ఉంటూ వస్తున్నారు. అయితే గత కొంత కాలంగా వీరు ఫామ్ కోల్పోయి పరుగుల కోసం తంటాలు పడుతున్నారు. తాజాగా శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ కు ప్రకటించిన భారత జట్టులో వీరిద్దరికీ చోటు దక్కలేదు. దీనిపై గావస్కర్ స్పందించారు. వీళ్లను ఎంపిక చేయరనే విషయం తనకు ముందే తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఊహించినట్లుగానే వారిపై బీసీసీఐ వేటు వేసిందని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు తిరిగి టీమ్ లోకి రావాలంటే... రంజీ ట్రోఫీలో వారు ఆడే ప్రతి మ్యాచ్ లో 200 లేదా 250 పరుగులు చేయాలని... అప్పుడే వారికి టీమిండియాలో పునరాగమనం చేయడానికి వీలు కలుగుతుందని గావస్కర్ వ్యాఖ్యానించాడు. ఇంకా ఏమన్నాడంటే..
’ సౌతాఫ్రికా (south africa) పర్యటనలో వారిద్దరి బ్యాటింగ్ చూసిన తర్వాత వీరిపై వేటు ఖాయం అని నేను ముందే ఊహించా. ఆ సిరీస్ లో వారు ఒక సెంచరీ లేదా కనీసం 80, 90 పరుగులు చేసి ఉంటే వేటు పడేది కాదు. రహానే అర్ధ సెంచరీ సాధించాడు. అయినప్పటికీ టీమ్ అతడి నుంచి అంతకంటే ఎక్కువే ఆశిస్తోంది. వారు పరుగులు చేయలేని సందర్భంలో వేటు పడటం ఖాయం. అంతేకాకుండా వారు ప్రస్తుతం 30 ప్లస్ ఏజ్ లో ఉన్నారు. శ్రీలంకతో జరిగే మ్యాచ్ ల్లో వీరి స్థానాల్లో జట్టులోకి వచ్చే ప్లేయర్స్ రాణిస్తే మాత్రం రహానే, పుజారాలకు టీమిండియా డోర్స్ శాశ్వతంగా మూసుకుపోయినట్లే‘ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheteswar Pujara, Jasprit Bumrah, Rohit sharma, Sunil Gavaskar