INDIA VS NZ SMRITI MANDHANA MISSED ONLY T20 AGAINST NEW ZEALAND INDIA FACES CONSECUTIVE FOURTH LOSS SK SJN
Smriti mandhana: స్టార్ బ్యాటర్ స్మృతి మంధానపై వేటు.. ఏకైక టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి
స్మృతి మంధాన
Women cricket: భారత మహిళల జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఓడిపోయింది. ఫిబ్రవరి 12 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ ఐదు వన్డేల సిరీస్‌తో సత్తా చాటాలని భారత జట్టు భావిస్తోంది.
న్యూజిలాండ్ (new zealand) పర్యటనను భారత మహిళల (indian women team) జట్టు పేలవ బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆరంభించింది. మార్చి నెలలో న్యూజిలాండ్ వేదికగా జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ (women ODI World cup) సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ పర్యటనలో భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్ మహిళల జట్టుతో బుధవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ ప్లేయర్లు సుజీ బేట్స్ (34 బంతుల్లో 36; 2 ఫోర్లు), కెప్టెన్ సోఫీ డివైన్ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), లీ తహూహు (14 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) తలా ఓ చెయ్యి వేయడంతో కివీస్ మంచి స్కోరును సాధించింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ రెండేసి వికెట్లతో రాణించారు. ఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసి ఓడింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్బినేని మేఘన (30 బంతుల్లో 37; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. యస్తిక భాటియా (26 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. భారత స్టార్ బ్యాటర్లు షఫాలీ వర్మ (13), సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (12) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ర్, అమీలియా కెర్ర్, హెలీ జెన్సెన్ తలా రెండు వికెట్లు తీశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరిసిన లీ తహూహు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఫిబ్రవరి 12న జరగనుంది.
స్మృతి మంధాన (smriti mandhana)పై వేటు...
గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన... కివీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఆడలేదు. ఆమెను మేనేజ్మెంట్ తుది జట్టుకు ఎంపిక చేయలేదు. మంధాన గాయపడిందని తొలుత అనుకున్నా.... భారత జట్టు ఆమె ఇంజూరిపై ఎటువంటి వ్యాఖ్య కూడా చేయలేదు. పూర్ ఫామ్ కారణంతోనే ఆమెను పక్కన పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అదే నిజమైతే వన్డే ప్రపంచ కప్ లాంటి మెగా ఈవెంట్ ముందు భారత్‌కు ఇది పెద్ద దెబ్బే.
ఐతే కరోనా ఐసోలేషన్ నిబంధనల వల్లే ఆమె ఏకైక టీ 20కి దూరమైందని తెలుస్తోంది. ఆమెతో పాటు మేఘనా సింగ్, రేణుకా సింగ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడలేదు. స్మృతి మంధాన స్థానంలో యస్తిక భాటికా ఓపెనింగ్ చేసింది. ఐతే స్మృతి మంధాన మరికొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి వన్డేలో కూడా ఆడకపోవచ్చని సమాచారం. భారత మహిళల జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఓడిపోయింది. ఐదు వన్డేల సిరీస్‌తో సత్తా చాటాలని భావిస్తోంది. ఫిబ్రవరి 12 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.