హామిల్డన్ టీ20 మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. చివరి ఓవర్ దాకా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా... ఒకటి 2, మరోటి 4 పరుగులతో ఓడింది. అవును... ఈరోజు మహిళల, పురుషుల మ్యాచ్ ఫలితాలు ఇవి. మొదట ముగిసిన మహిళల పోరులో చివరి ఓవర్ దాకా పోరాడిన అమ్మాయిలు 2 పరుగుల తేడాతో ఓడిపోగా... మధ్యాహ్నం సాగిన మ్యాచ్‌లోనూ ఇదే ఫలితం వచ్చింది. చివరి ఓవర్ దాకా సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో విజయానికి 4 పరుగుల దూరంలో ఆగిపోయింది మహిళా జట్టు. పురుషుల జట్టులో టాస్ గెలిచి ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ అప్పగించిన కెప్టెన్ రోహిత్ శర్మ... తగిన మూల్యాన్ని చెల్లించుకున్నాడు. భారత బౌలర్లను చీల్చి చెండాడిన కివీస్ జట్టు... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. భారీ లక్ష్యచేధనలో కడదాకా పోరాడిన భారత జట్టు... 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా కలిసి చివరి బంతి దాకా పోరాడినా... విజయ తీరాన్ని చేర్చలేకపోయారు.
భారత క్రికెటర్ స్మృతి మంధానా
ఓడినా... భారీ లక్ష్యచేధనలో ఈ ఇద్దరూ పోరాడిన తీరు క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ, విజయ్ శంకర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కి ఈ ఇద్దరూ కలిసి 75 పరుగులు జోడించిన తర్వాత విజయ్ శంకర్ అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు విజయ్ శంకర్. ఆ తర్వాత రిషబ్ పంత్ క్రీజులోకి వస్తూనే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 12 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 28 పరుగులు చేసిన రిషబ్ పంత్... టిక్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు.
విజయ్ శంకర్ బ్యాటింగ్
అప్పటికి భారత్ స్కోరు 12.2 ఓవర్లలో 121 పరుగులు. కొద్దిసేపటికి 32 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా, 2 పరుగులు చేసిన ధోనీ వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది భారత జట్టు. 28 బంతుల్లో 67 పరుగులు కావల్సిన దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా అద్భుతంగా పోరాడారు. కార్తీక్ 16 బంతుల్లో 4 సిక్సర్లతో 33 పరుగులు చేయగా... కృనాల్ పాండ్యా 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు.
అంతకుముందు టాస్ గెలిచిన రోహిత్ శర్మ... ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కివీస్ ఓపెనర్లు చెలరేగి ఆడడంతో... మొదటి 7.4 ఓవర్లలోనే 80 పరుగులు రాబట్టింది కివీస్ జట్టు. ఈ దశలో సీఫర్ట్‌ను స్టంప్ అవుట్ చేసిన ధోనీ... భారత్‌కు తొలి బ్రేక్ అందించాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 25 బంతుల్లోనే 43 పరుగులు చేసిన టిమ్ సీఫర్ట్... కుల్దీప్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి ధోనీకి వికెట్ల దగ్గర దొరికేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియంసన్‌తో కలిసి మున్రో చెలరేగిపోయాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు. మున్రోను కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా... 21 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన కివీస్ కెప్టెన్‌ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు.
అప్పటికే 14.4 ఓవర్లలో జట్టు స్కోరు 150 పరుగుల మార్కు దాటడం విశేషం. ఆ తర్వాత మిచెట్, గ్రాండ్‌హోమ్ కలిసి భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. 15 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన గ్రాండ్‌హోమ్, భువనేశ్వర్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మిచెల్ 19, రాస్ టేలర్ 14 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది కివీస్. కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ యాదవ్, ఖలీల్ అహ్మద్‌కు చెరో వికెట్ దక్కాయి.
ఇది కూడా చదవండి...
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.