ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సిరీస్ వల్ల ఐదు కేజీల బరువు తగ్గిపోయానంటూ తెలిపాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 41 డిగ్రీల సెల్సియస్‌లో ఆడడం వల్లే ఇలా జరిగిందని స్టోక్స్ పేర్కొన్నాడు.తాను మాత్రమే కాకుండా జట్టు సభ్యులు అందరూ అనారోగ్యానికి గురయ్యారని ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు. నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ మరియు 25 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.'' ఇంగ్లండ్‌లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. నాలుగో టెస్టు సందర్భంగా ఎండ వేడిమి సందర్భంగా నలుగురు ఆటగాళ్లు అనారోగ్యానికి గురయ్యాం. 41 డిగ్రీల వేడిమిలో ఆడడం వల్లే బహుశా ఇలా జరిగి ఉండొచ్చు. నేను ఒక వారంలోనే 5 కేజీలు బరువు తగ్గితే.. డోమ్ సిబ్లీ 4 కేజీలు, జేమ్స్ అండర్సన్ 3 కేజీలు బరువు తగ్గిపోయారు. జాక్ లీచ్ అయితే ప్రతీ బౌలింగ్ స్సెల్ విరామంలో డిప్రెషన్‌కు గురయ్యి.. టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఎలాంటి ఒత్తిడి ఉన్నా మేము జట్టుగా ఆడాల్సిందే.. అందుకే అన్ని బాధలు ఓర్చుకొని బరిలోకి దిగాం.
అయితే టీమిండియా ఆటగాళ్లకు ఇలాంటి వాతావరణం అలవాటు కావడంతో వాళ్లు తట్టుకొని నిలబడిగలిగారు. ముఖ్యంగా రిషబ్ పంత్, సుందర్‌ల నుంచి మంచి ఇన్నింగ్స్‌లు వచ్చాయి. నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఈ సిరీస్‌తో ఎన్నో పాఠాలు నేర్చకున్నాం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మేమింకా మెరుగుపడాల్సి ఉందని తెలుసుకున్నాం. అయితే జట్టులో యంగ్ క్రికెటర్లుగా ఉన్న ఓలి పోప్, జాక్ క్రాలే, సిబ్లీ లాంటి వారికి ఇది ఒక చేదు పర్యటనగా మిగిలిపోయింది." అంటూ చెప్పుకొచ్చాడు.
3-1 తేడాతో టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది కోహ్లీసేన. ఫస్ట్ టెస్ట్ ఓటమి తర్వాత.. టీమిండియా హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. ఫలితంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్యూటీసీ) ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరగా.. తాజాగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది.