హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ENG: భారత్ గెలిచే మ్యాచ్‌ను ఓడించిన వరుణుడు.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ డ్రా

IND vs ENG: భారత్ గెలిచే మ్యాచ్‌ను ఓడించిన వరుణుడు.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ డ్రా

కొహ్లీ, జో రూట్

కొహ్లీ, జో రూట్

ఆదివారం మ్యాచ్‌ ప్రారంభం అవుతుందా?.. అని చివరి సెషన్‌ వరకూ ఎదురుచూసినా వాతావరణం ఏ మాత్రం అనుకూలించలేదు. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో అంపైర్లు చివరి రోజు ఆటను రద్దు చేశారు.

  భారత్ ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ డ్రా అయింది. వరుణుడి దెబ్బకు చేజారిపోయింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన భారత్, ఇంగ్లాండ్ తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఐదో రోజు టీమ్‌ఇండియా విజయానికి 157 పరుగులే అవసరం. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. మనోళ్లు బ్యాటింగ్‌కు దిగితే ఖచ్చితంగా గెలిచే మ్యాచ్. కానీ వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడలేదు. ఆదివారం మ్యాచ్‌ ప్రారంభం అవుతుందా?.. అని చివరి సెషన్‌ వరకూ ఎదురుచూసినా వాతావరణం ఏ మాత్రం అనుకూలించలేదు. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో అంపైర్లు చివరి రోజు ఆటను రద్దు చేశారు. అలా భారత్‌ విజయం సాధించాల్సిన తొలి టెస్టు డ్రాతో ముగిసింది. ఈ నేపథ్యంలో రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇరు జట్లకూ చెరో 4 పాయింట్లు దక్కాయి.

  ఇంగ్లాండ్‌ శనివారం రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటయింది. కెప్టెన్‌ జో రూట్‌ 172 బంతుల్లో 109 పరుగులు చేసి శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో బుమ్రా దుమ్మురేపాడు. ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. ఇక సిరాజ్‌, శార్ధూల్‌ చెరో రెండు వికెట్లు సాధించగా... షమి ఒక వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత.. టీమ్‌ ఇండియా 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఐతే నాలుగు రోజు టీమిండియా 52/1తో నిలిచింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 38 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఆ తర్వాత రోహిత్‌ శర్మ 12, చటేశ్వర్ పుజరా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదో రోజు టీమిండియా 157 పరుగులు చేయాల్సి ఉండగా.. ఒక్క బాల్ కూడా పడకుండానే ముగిసింది.

  ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 183 పరుగులు చేసి ఆలౌటయింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ రూట్ అదరగొట్టాడు. 64 పరుగులు చేసి అర్ధశతకంతో రాణించాడు. బెయిర్ స్టో 29, క్రాలీ, సామ్ కర్రన్ 27 తలో 27 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా.. 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ 84, రవీంద్ర జడేజా 56 అర్ధ శతకాలతో రాణించారు. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ జో రూట్ అద్భుతంగా ఆడాడు. 172 బంతుల్లో 109 పరుగులు చేసి.. సెంచరీతో చెలరేగిపోయాడు. సామ్ కరన్ 32 పరుగు చేయగా.. బెయిర్ స్టో 30 రన్స్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో జాస్ప్రిత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయగా... రెండో ఇన్సింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. కానీ భారత్ ఈజీగా గెలవాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయి.. డ్రాగా ముగిసింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cricket, IND VS ENG, Sports

  ఉత్తమ కథలు