news18-telugu
Updated: November 23, 2020, 8:37 PM IST
తల్లిదండ్రులతో మహ్మద్ సిరాజ్ (ఫొటో-PTI)
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన తండ్రి మహ్మద్ గౌస్ అంత్యక్రియలకు హాజరుకాకపోవడానికి కారణం ఏంటో వెల్లడించాడు. తన తల్లి రావొద్దని కోరిందని, క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చూపడం ద్వారా తండ్రి కలను నెరవేర్చాలని తన తల్లి చెప్పిందని మహ్మద్ సిరాజ్ చెప్పాడు. ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపికైన టెస్టు జట్టులో మహ్మద్ సిరాజ్ తొలిసారి స్థానం సంపాదించాడు. గత శుక్రవారం (నవంబర్ 20) సిరాజ్ తండ్రి చనిపోయారు. ‘తండ్రి మరణం నాకు తీరని లోటు. మా నాన్న నన్ను ఎప్పుడూ ప్రోత్సహించాడు. నేను భారత్కోసం క్రికెట్ ఆడాలనేది నా తండ్రి కల. దేశం గర్వపడేలా చూడాలని కోరుకుంటున్నా. నా తండ్రి కలను నెరవేర్చాలనుకుంటున్నా. మా నాన్న ఎప్పుడూ నాతోనే ఉంటారు. ఈ పరిస్థితుల్లో ప్రతి టీమ్ మెంబర్ నాకు అండగా నిలబడ్డారు. నాకు చాలా భరోసా కల్పించారు. విరాట్ కోహ్లీ కూడా ధైర్యం చెప్పాడు. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పాడు. మా నాన్న చనిపోయినప్పుడు అమ్మతో మాట్లాడా. ఆస్ట్రేలియాలోనే ఉండి, మా నాన్న కలను నిజం చేయమని చెప్పింది.’ అని సిరాజ్ అన్నాడు.
హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు మహమ్మద్ సిరాజ్. తండ్రి మరణించడంతో సిరాజ్ ఇండియాకు తిరిగి వచ్చేస్తాడని.. అంతక్రియలు ముగిసిన తర్వాత మళ్లీ టీమిండియాలో జాయిన్ అవుతాడని అందరూ భావించారు. కానీ సిరాజ్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినప్పటికీ.. జట్టుతోనే ఉండాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ' టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తండ్రి తీవ్ర అనారోగ్యంతో మరణించారు. సిరాజ్‌తో బీసీసీఐ మాట్లాడింది. తిరిగి ఇండియాకు వెళ్లి, ఫ్యామిలీతో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. కానీ సిరాజ్ జట్టుతోనే ఉండాలని, తన విధులను నిర్వర్తించాలని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సిరాజ్‌కు తోడుగా ఉంటాం.'' అని బీసీసీఐ గౌరవ కార్యదర్శి జయ్ షా పేర్నొన్నారు.
సిరాజ్ తండ్రి ఉపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధ పడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ సెషన్స్ నుంచి వచ్చిన తర్వాత సిరాజ్‌కు ఈ విషయం గురించి తెలిసిందని స్పోర్ట్‌స్టార్ వెబ్సైట్ పేర్కొంది. "మా నాన్న ఎప్పుడూ.. నేను దేశాన్ని గర్వించేలా చేయాలి అని కోరుకునేవాడు. ఆయన మరణవార్త నన్ను షాక్‌కు గురిచేసింది. నా జీవితంలో అతిపెద్ద మద్దతును కోల్పోయాను. నేను దేశం కోసం ఆడటం మా నాన్న కళ. నేను దాన్ని నేరవేర్చి ఆయనను ఆనందపరిచాను" అని సిరాజ్ స్పోర్ట్‌స్టార్ వెబ్‌సైట్‌కు తెలిపాడు.
ఇక, యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున మహమ్మద్ సిరాజ్ ఆడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే సిరాజ్.. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఓ వీడియో ద్వారా చెప్పాడు. ఇది తనకు ఆందోళన కలిగిస్తోందని కూడా తెలిపాడు. ప్రస్తుతం ఆయన వద్దకు వెళ్లలేని.. ఫోన్లో మాట్లాడుతున్నానని కన్నీరు పెట్టుకున్నాడు. ఐతే ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో సిరాజ్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసింది బీసీసీఐ.
సిరాజ్ టీమిండియాకు ఒక వన్డే, మూడు టీ20లు ఆడాడు. వన్డేల్లో ఇంకా వికెట్ రాలేదు. టీ20ల్లో మూడు వికెట్లు తీశాడు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 23, 2020, 8:26 PM IST