ఆస్ట్రేలియాపై మూడు టీ20ల సిరీస్ 2-1తో గెలిచి ఆనందంలో ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఆఖరి టీ20లో స్లో ఓవర్‌రేట్‌కు కారణమైన టీమిండియాపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. భారత జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ జరిమానా విధించాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో భారత జట్టు నిర్ధిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తెలిపాడు. ఫీల్డ్ అంపైర్లు రాడ్ టక్కర్, గెరార్డ్ అబూద్ స్లో ఓవర్ రేట్ విషయాన్ని మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ తప్పిదాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అంగీకరించడంతో పాటు పశ్చాతాపం వ్యక్తం చేశాడు. దీంతో ఎలాంటి వాదోపవాదనలు లేకుండా ఐసీసీ నిబంధనల మేరకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ చర్యలు తీసుకున్నారు. ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు.
ఆఖరి టీ20లో భారత్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. మాథ్యూవేడ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80), గ్లేన్ మ్యాక్స్‌వెల్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సుంధర్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, ఠాకుర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులే చేసింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్వెప్సన్ (3/23) భారత పతనాన్ని శాసించగా.. మ్యాక్స్‌వెల్, అబాట్, టై, జంపా తలో వికెట్ తీశారు.
Published by:Sridhar Reddy
First published:December 09, 2020, 14:09 IST