news18-telugu
Updated: November 27, 2020, 8:21 PM IST
ఆందోళనకారులను బయటకు తీసుకెళ్తున్న సెక్యూరిటీ సిబ్బంది
ఆస్ట్రేలియాలో క్రికెట్ సందడి నెలకొంది. ఆసీస్-ఇండియా (AUS vs IND) మ్యాచ్‌ల నేపథ్యంలో అక్కడి అభిమానులకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. అంతేకాదు ఈ కరోనా కాలంలో చాలా రోజుల తర్వాత.. గ్రౌండ్లోకి ప్రేక్షకులను అనుమతిచ్చారు. సిడ్నీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌కు ప్రేక్షకులు బాగానే తరలివచ్చారు. ఐతే మొదటి మ్యాచ్‌లోనే తీవ్ర కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆందోళనకారులు గ్రౌండ్లోకి దూసుకొచ్చారు. దాదాపు పిచ్ వరకు రావడంతో గేమ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఇరుజట్ల సభ్యులతో పాటు మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు, సెక్యూరిటీ సిబ్బంది, నిర్వాహకులుంతా షాక్‌కు గురయ్యారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్ పూర్తైన తర్వాత.. ఆరో ఓవర్ వేసేందుకు నవదీప్ సైని సిద్ధమవుతున్నాడు. అదే సమయంలో ఇద్దరు ఆందోళనకారులు సెక్యూరిటీని దాటుకొని గ్రౌండ్లోకి వచ్చారు. భారత బౌలర్ నవదీప్ సైనికి దగ్గరగా వెళ్లారు. వారిలో ఒకరు చేతిలో ప్లకార్డును పట్టుకున్నాడు. దానిపై 'SBI.. NO 1 BN LOAN ADANI LOAN' అని రాసి ఉంది. ''స్టేట్ ఆఫ్ ఇండియా.. దయచేసి అదాని గ్రూప్‌కు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేయవద్దు.'' అని దాని అర్థం. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిద్దరిని అదుపులోకి తీసుకొని బయటకు పంపించారు. అనంతరం గేమ్ మళ్లీ ప్రారంభమైంది.
ఆస్ట్రేలియాలో అదాని గ్రూప్.. కేర్మికేల్ కోల్ మైన్ ( Carmichael coal mine) ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు ప్రపంచంలో ఏ బ్యాంకూ లోన్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం లోన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఐతే ఈ కోల్‌మైన్ ప్రాజెక్టుపై ఆస్ట్రేలియాలో కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వాతావరణం ఎంతో కలుషితమైందని.. ఈ కోల్మైన్తో మరింత దిగజారుతుందని చాలా మంది పర్యావరణ ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో తమ నిరసనను ప్రదర్శించారు. క్రికెట్ మ్యాచ్ ద్వారా కోట్లాది మందికి తమ ఆవేదన చేరుతుందని.. అందుకే ఈ పని చేశామని నిరసనకారులు తెలిపారు. అదానీకి లోన్ ఇవ్వకూడదని ఎస్బీఐకి విజ్ఞప్తి చేశారు.
కాగా, సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. 66 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. అరోన్ ఫించ్ (114), స్టీవ్ స్మిత్ (105) సెంచరీలతో చెలరేగా.. వార్నర్ (69), మాక్స్వెల్ (45) రన్స్‌తో ఆకట్టుకున్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 308 రన్స్ మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్యా 90, శిఖర్ ధావన్ 74 పరుగులు చేశారు. మిగతావారు పెద్దగా రాణించలేదు. జంపా 4, హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 27, 2020, 8:07 PM IST