news18-telugu
Updated: November 27, 2020, 9:57 PM IST
మహమ్మద్ సిరాజ్, అడమ్ గిల్‌క్రిస్ట్, నవదీప్ సైని
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఎందుకంటే.. ఈ మాజీ క్రికెటర్ టీమిండియా యువ ఆటగాళ్లు మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj), నవదీప్ సైని (Navdeep saini)కి క్షమాపణలు తెలిపారు. సోషల్ మీడియాలో గిల్‌క్రిస్ట్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో.. ఆయన దిగి రాక తప్పలేదు. ఎట్టకేలకు చేసిన తప్పును తెలుసుకొని.. క్షమాపణలు చెప్పాడు. అసలేం జరిగిందంటే.. గురువారం సిడ్నీ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా మ్యాచ్‌కు గిల్‌క్రిస్ట్ కామెంటేటర్‌గా వ్యవహరించారు. ఐతే సైని బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆయన పొరపాటు చేశారు. సైని తండ్రి ఇటీవలే మరణించాడని.. ఐనప్పటికీ క్రికెట్ పట్ల అంకిత భావంతో ఇంటికి వెళ్లకుండా మ్యాచ్ ఆడుతున్నాడని చెప్పారు.
ఐతే వాస్తవానికి హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తండ్రి కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మరణించారు. ఈ విషయంలో గిల్‌క్రిస్ట్ పొరపాటు పడ్డాడు. సైని తండ్రి చనిపోయినట్లు కామెంట్రీలో చెప్పాడు. అది పొరపాటున అలా జరిగిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు ట్వీట్స్ చేశారు. నవదీప్ సైని చనిపోలేదని.. సిరాజ్ తండ్రి మరణించాడని పలువురు నెటిజన్లు గిల్‌క్రిస్ట్ ట్యాగ్ చేశారు.
జరిగిన తప్పును తెలుసుకున్న గిల్ క్రిస్ట్.. ఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నట్లు ట్వీట్ చేశారు.
గిల్‌క్రిస్ట్ క్షమాపణలు చెప్పినందుకు పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. జరిగిన తప్పును తెలుసుకొని..తన కన్నా వయసులో చిన్నవారికి క్షమాపణలు చెప్పడం చాలా గ్రేట్ అని కామెంట్ చేస్తున్నారు. మీరు గొప్ప హృదయం కలవారని ట్వీట్స్ చేస్తున్నారు. కాగా, సిరాజ్ తండ్రి మరణించినప్పటికీ.. అతడు ఇండియాకు రాలేదు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినా.. జట్టుతోనే ఉండాలని సిరాజ్ నిర్ణయించుకున్నాడు. క్రికెట్ పట్ల ఉన్న అతడి అంకిత భావానికి ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.కాగా, సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. 66 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. అరోన్ ఫించ్ (114), స్టీవ్ స్మిత్ (105) సెంచరీలతో చెలరేగా.. వార్నర్ (69), మాక్స్వెల్ (45) రన్స్‌తో ఆకట్టుకున్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 308 రన్స్ మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్యా 90, శిఖర్ ధావన్ 74 పరుగులు చేశారు. మిగతావారు పెద్దగా రాణించలేదు. జంపా 4, హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 27, 2020, 9:57 PM IST