news18-telugu
Updated: November 29, 2020, 1:39 PM IST
india vs australia 2020(Image Credit-Twitter/ICC)
భారత్ ముందు ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత్ 390 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 389 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు టీమిండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కనీసం పరుగులను నియత్రించలేక భారత బౌలర్లు చేతులెత్తేశారు. ఇక, తొలి ఓవర్ నుంచే ఆసీస్ ఓపెనర్లు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్‌లు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తొలి వికెటుకు వీరిద్దరు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 23 ఓవర్లో షమీ బౌలింగ్ ఫించ్(69 బంతుల్లో 60 పరుగులు) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే వార్నర్(77 బంతుల్లో 83 పరుగులు) రనౌట్ అయి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న స్మిత్, మార్నస్ లబుషేన్‌లు దూకుడుగా ఆడుతూ పరుగులు వరద పారించారు.
ఈ క్రమంలోనే స్మిత్ సెంచరీ చేశాడు. సెంచరీ చేసిన కొద్దిసేపటికే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో స్మిత్(64 బంతుల్లో 104 పరుగులు) వెనుదిరిగాడు. స్మిత్ పెవిలియన్‌కు చేరిన తర్వాత లబుషేన్‌తో కలిసి మాక్స్వెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లోనే 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక, 49వ ఓవర్లో లబుషేన్(61 బంతుల్లో 70 పరుగులు) ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన హెన్రీక్స్ ఒక్క బంతి ఎదుర్కొని 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఆసీస్ బ్యాటింగ్‌ను ఎదుర్కొవడంలో టీమిండియా బౌలర్లు మరోసారి విఫలమయ్యారు. ఒక్కరిద్దరు బౌలర్లు మినహా మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారు. నవదీప్ సైనీ ఏకంగా 7 ఓవర్లలో 70 పరుగులిచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసేందుకు వీలు కల్పించింది. ఇక, తొలి వన్డేలో ఆసీస్ నిర్దేశించిన 375 పరుగులు లక్ష్యాన్ని చేధించలేకపోయిన సంగతి తెలిసిందే. ఎంతగా ప్రయత్నించినప్పటకీ.. 50 ఓవర్లలో 8 వికెట్లకు 308 పరుగులకు పరిమితమైంది. మరి ఈ మ్యాచ్‌లో అంతకు మించిన లక్ష్యాన్ని భారతజట్టు ఏ మేరకు చేధిస్తుందో వేచి చూడాలి.
Published by:
Sumanth Kanukula
First published:
November 29, 2020, 1:31 PM IST