ఇండియా మహిళా జట్టు (Team India Women) ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం సాధించింది. ఒకే మ్యాచ్‌లో అనేక రికార్డులు బద్దలు కొట్టింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో భారత మహిళలు 2 వికెట్ల తేడాతో గెలిచారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు (Australia Women) బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రేచెల్ హెయిన్స్ (13), అలీసా హీలీ (35) కలసి తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. అయితే జులన్ గోస్వామీ (Jhulan Goswami) ఒకే ఓవర్లో రేచల్ హెయిన్స్ (13), మెగ్ లాన్నింగ్స్ (0)ను పెవీలియన్ పంపింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తుండటంటో ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేక పోయారు. ఓపెనర్ అలీసా హీలీ (35) రనౌట్.. ఎలీస్ పెర్రీ (26) తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరారు. దీంతో 87 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
రెండో వన్డేలో సెంచరీ కొట్టిన బెత్ మూనీ (52), ఆష్లీ గార్డెనర్ (67), తహిలా మెక్‌గ్రాత్ (47) రాణించడంతో ఆస్ట్రేలియా కోలుకొని భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి ఇండియా ముందు భారీ టార్గెట్ నిలిపింది. జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్ చెరి 3 వికెట్లు తీయగా.. స్నేహ్ రాణాకు ఒక వికెట్ దక్కింది. ఇక ఛేజింగ్‌లో భారత టాపార్డర్ రాణించింది. స్మృతి మంధాన (22) (Smriti Mandhana) త్వరగానే అవుటైనా.. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (56), యాస్తికా భాటియా (64) కలసి రెండో వికెట్‌కు 101 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే స్వల్ప వ్యవధిలో టీమ్ ఇండియా షెఫాలీ వర్మ, రిచా ఘోష్ (0), యాస్తికా భాటియా వికెట్లు కోల్పోయింది. మిథాలీ రాజ్ (16) (Mithali Raj), పూజా వస్త్రాకర్ (3) కూడా నిరాశ పరచడంతో భారత్ ఓటమి దిశగా పయనించింది. అయితే దీప్తి శర్మ (31), స్నేహ్ రాణా (30) కలసి ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. వీరిద్దరు కలసి ఏడో వికెట్‌కు 33 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ అవుటైనా జులన్ గోస్వామి, మేఘన సింగ్ కలసి భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జులన్ గోస్వామికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
- ఆస్ట్రేలియా జట్టు వరుసగా 26 వన్డేల్లో విజయం సాధించగా.. ఆ విజయ పరంపరను భారత మహిళలు అడ్డుకున్నారు.
- భారత మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్ చేజ్ ఇదే. భారత జట్టు 250+ పరుగులను ఛేజ్ చేయడం ఇదే మొదటి సారి. గతంలో 248 పరుగులను సౌతాఫ్రికా మీద ఛేజ్ చేసింది.
- ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన రెండో జట్టుగా భారత మహిళలు రికార్డు సృష్టించారు. గతంలో న్యూజీలాండ్ 276 పరుగులు ఛేజ్ చేయగా.. ఇప్పుడు ఇండియా 265 పరుగులు ఛేజ్ చేసింి.
- ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 250+ స్కోర్ ఛేజ్ చేయలేదు.
- వన్డేల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌గా జులన్ గోస్వామి రికార్డు సృష్టించింది. ఆదివారం ఆడిన మ్యాచ్ ఆమెకు 192వది. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఇంగ్లాండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ (191) ఉండగా.. టాప్ ప్లేస్‌లో మిథాలీ రాజ్ (220) ఉన్నది.
- ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో అర్దసెంచరీ చేసిన రెండో అతిపిన్న వయస్కురాలిగా షెఫాలీ వర్మ రికార్డు సృష్టించింది.
- ఈ సిరీస్‌లో ఇరు జట్లు కలిపి 1531 పరుగుల స్కోర్ చేశాయి. గతంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజీలాండ్-ఆస్ట్రేలియా కలపి 1603 పరుగులు చేశాయి. దాని తర్వాత ఇదే అత్యధికం.
- ఇండియా ఈ ఏడాది మొత్తం 11 వన్డేలు ఆడగా 8 మ్యాచ్‌లు ఓడిపోయి 3 మ్యాచ్‌లు గెలిచింది. ఈ మూడు మ్యాచ్‌లు కూడా ఛేజింగ్ ద్వారానే గెలవడం గమనార్హం.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.