హోమ్ /వార్తలు /క్రీడలు /

WTC Final : జోరు మీదున్న కివీస్.. ఫైనల్‌లో టీమ్ ఇండియాపై ఆధిపత్యం చెలాయిస్తుందా? గత రికార్డులు ఏం చెబుతున్నాయి?

WTC Final : జోరు మీదున్న కివీస్.. ఫైనల్‌లో టీమ్ ఇండియాపై ఆధిపత్యం చెలాయిస్తుందా? గత రికార్డులు ఏం చెబుతున్నాయి?

డబ్ల్యూటీసీ ఫైనల్.. గత రికార్డులు ఏమి చెబుతున్నాయి?

డబ్ల్యూటీసీ ఫైనల్.. గత రికార్డులు ఏమి చెబుతున్నాయి?

మరో 10 రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్నది. సౌతాంప్టన్‌లోని ఏజెస్ బౌల్ వేదికగా ఇండియా, న్యూజీలాండ్ మధ్య జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఎవరిది పై చేయి అవుతుంది. గత టెస్టు రికార్డులు ఏ జట్లకు అనుకూలంగా ఉన్నాయి?

    ఐసీసీ నిర్వహిస్తున్న అరంగేట్రం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఇండియా, న్యూజీలాండ్ జట్లు సౌతాంప్టన్‌లోని ఏజెస్ బౌల్ స్టేడియంలో తలపడనున్నాయి. జూన్ 18 నుంచి 22 మధ్య జరుగనున్న ఈ చారిత్రాత్మక టెస్టులో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు బేరీజు వేస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన టెస్టు క్రికెట్ చరిత్ర చూస్తే టీమ్ ఇండియాదే పై చేయిగా కనిపిస్తున్నది. అయితే ఇటీవల న్యూజీలాండ్ జట్టు ఫామ్‌ను అంచనా వేస్తే వారి ఆధిపత్యమే కొనసాగేలా ఉన్నది. గత ఏడాది భారత జట్టు న్యూజీలాండ్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. తొలి టెస్టు 4 రోజుల్లో, రెండో టెస్టు 3 రోజుల్లో ముగిసింది. టీమ్ ఇండియా నాలుగు ఇన్నింగ్స్‌లో హయ్యెస్ట్ స్కోర్ 242. న్యూజీలాండ్ పేసర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా క్రీజులో నిలవలేక పోయారు. తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో, రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘోర పరాజయాలు మూట గట్టుకున్నది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్ వచ్చిన కివీస్ జట్టు రెండు టెస్టులు ఆడుతున్నది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టును దాదాపు ఓడించినంత పని చేసింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 250+ టార్గెట్ పెట్టి రెండు సెషన్లు ఉండగానే ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్ అప్పగించడం సాహసోపేతమైన నిర్ణయం. ఇక అరంగేట్రం బ్యాట్స్‌మెన్ డబుల్ సెంచరీ బాదడం, పేసర్ టిమ్ సౌథీ ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికట్లు తీయడం చూస్తుంటే ఇంగ్లాండ్ గడ్డపై వారి జోరు ఎలా ఉన్నదో అర్థం అవుతున్నది. మరోవైపు టీమ్ ఇండియా పూర్తి సాధనే మొదలు పెట్టలేదు. ఐపీఎల్ తర్వాత భారత క్రికెటర్లు కనీసం బ్యాటు కూడా పట్టలేదు.

    న్యూజీలాండ్-ఇండియా గత రికార్డులు

    - టీమ్ ఇండియా, కివీస్ జట్ల మధ్య ఇప్పటి వరకు 59 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇండియా 21 టెస్టుల్లో, న్యూజీలాండ్ 12 టెస్టుల్లో విజయం సాధించాయి. 26 టెస్టులు డ్రాగా ముగిశాయి.

    - న్యూజీలాండ్ జట్టుపై మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 15 టెస్టులు ఆడి 63.80 సగటుతో 1659 పరుగులు చేశాడు. ఆ జట్టుపై అత్యధిక స్కోరు ఇదే. ఇక రాహుల్ద్రవిడ్ 6 సెంచరీలు కూడా నమోదు చేశాడు. ఇక ప్రస్తుతం టీమ్ ఇండియాలో ఉన్న బ్యాట్స్‌మెన్‌లలో విరాట్ కోహ్లీ 773 పరుగులు చేయగా.. ఇందులో ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి.

    - న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇండియాపై కేవలం 10 టెస్టుల్లో 1224 పరుగులు చేశాడు. ఇందులో ఒక ట్రిపుల్ సెంచరీ కూడా ఉన్నది. మొత్తం 4 సెంచరీలు, 2 అర్దసెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న వారిలో రాస్ టేలర్ 812 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

    - దిగ్గజ బౌలర్ రిచర్డ్ హాడ్లీ ఇండియాపై 65 వికెట్లు తీశాడు. 22.93 సగటుతో అతడు ఇండియాపై ఆధిపత్యం చెలాయించాడు. తన 400వ వికెట్ ఇండియాకు చెందిన అరుణ్ లాల్ కావడం విశేషం.

    - ప్రస్తుత న్యూజీలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 8 టెస్టుల్లో 24.43 సగటుతో 39 వికెట్లు తీశాడు. ఇండియాపై ఇతడే బెస్ట్ బౌలర్‌గా ఉన్నాడు.

    - టీమ్ ఇండియా తరపున రవిచంద్రన్ అశ్విన్ 48 వికెట్లతో కివీస్‌పై మంచి రికార్డు కలిగి ఉన్నాడు. అతడి సగటు 16.97గా ఉన్నది.

    Euro Cup : జూన్ 11 నుంచి యూరో కప్ 2021.. 6 గ్రూపులు.. 24 జట్లు.. 11 వేదికలు.. 51 మ్యాచ్‌లు.. పూర్తి షెడ్యూల్ ఇదే


    ఏజెస్ బౌల్ పిచ్ ఎవరికి అనుకూలం?

    సౌతాంప్టన్‌లోని ఏజెస్ బౌల్ పిచ్ ఉపఖండంలోని పిచ్‌లను పోలి ఉంటుంది. ముందుగా పేసర్లకు అనుకూలంగా ఉన్నా.. తర్వాత స్పిన్నర్లకు సహకరిస్తుందని పిచ్ క్యురేటర్ చెబుతున్నారు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన టీమ్ ఇండియా ఈ పిచ్‌పై ఒక టెస్టు మ్యాచ్ ఆడింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీ ఈ పిచ్‌పై చెలరేగిపోయాడు. టీమ్ ఇండియాలోని రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు ఈ పిచ్ చక్కగా కలసి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు డ్యూక్ బంతుల కారణంగా బంతి బౌన్స్ అయ్యే అవకాశం ఉన్నది. భారత జట్టు క్రికెటర్లు ఓపికతో బ్యాటింగ్ చేస్తే పరుగులు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు.

    Published by:John Kora
    First published:

    Tags: ICC, India vs newzealand, Team India, WTC Final

    ఉత్తమ కథలు