INDIA NEVER WON A TEST SERIES IN SOUTH AFRICA WILL VIRAT KOHLI CHANGE HISTORY JNK
IND vs SA: 29 ఏళ్ల నుంచి సాధ్యం కానిది.. విరాట్ కోహ్లీ చేసి చూపిస్తాడా? టీమ్ ఇండియాలో ఆ సత్తా ఉందా?
ఏ భారత కెప్టెన్ వల్ల కానిది విరాట్ కోహ్లీ చేసి చూపిస్తాడా? (PC: BCCI)
IND vs SA: భారత జట్టు గత 29 ఏళ్లుగా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవలేదు. కేవలం ఒక సారి మాత్రమే సిరీస్ డ్రా చేసుకున్నది. మిగిలిన 6 సార్లు టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. అయితే ఈ సారి టెస్టు సిరీస్ గెలవడం భారత జట్టుకే కాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఎంతో కీలకంగా మారింది.
భారత క్రికెట్ జట్టు (Team India) డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో (South Africa Vs India) తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్ టీమ్ ఇండియాకే కాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) కూడా చాలా కీలకం. భారత జట్టు ఇప్పటి వరకు సిరీస్ గెలవని ఏకైక దేశం దక్షిణాఫ్రికా. కెప్టెన్సీ వివాదాన్ని (Captaincy Rift) మర్చిపోయి కోహ్లీ.. ఆఫ్రికాలో భారత జట్టు చరిత్రను మార్చాలనుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో వన్డే-టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేరు. కీలకమైన ఆటగాళ్లు టెస్టు జట్టుకు దూరమైనా దక్షిణాఫ్రికాను ఓడించే సత్తా ఇండియాకు ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. గత 29 ఏళ్లగా ఏ భారత జట్టు కెప్టెన్‌కు సాధ్యం కాని ఫీట్‌ను విరాట్ కోహ్లీ చేసి చూపెట్టాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
1992లో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో టీమిండియా తొలిసారి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఓడిపోయింది. స్వింగ్, పేస్, బౌన్స్‌తో కూడిన పిచ్‌లపై మూడు టెస్టులను భారత్ డ్రా చేసుకోగలిగింది. ప్రవీణ్ ఆమ్రే ఈ పర్యటనలో తొలి టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసి తొలి ఇన్నింగ్స్‌లోనే అద్భుత సెంచరీ సాధించాడు. శ్రేయస్ అయ్యర్ గురువుగా భావించే అమ్రే తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన కొద్ది మంది భారత బ్యాటర్లలో ఒకడు. ఈ సిరీస్‌లో అయ్యర్ కూడా ఉండటం యాదృశ్చికమే.
1997లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో భారత్ రెండోసారి ఆఫ్రికాలో పర్యటించింది. తొలి టెస్టులో 328 పరుగులతో, రెండో టెస్టులో 282 పరుగులతో భారత్ ఘోర పరాజయం పాలైంది. అయితే రాహుల్ ద్రవిడ్ పెద్ద అడ్డుగోడగా మారి భారీ ఇన్నింగ్స్ ఆడటంతో మూడో టెస్టు డ్రా అయింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ద్రవిడ్ తొలి ఇన్నింగ్స్‌లో 148, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేశాడు. మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. 20 వికెట్లు తీసిన అలన్ డొనాల్డ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.
సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2001లో దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ 1-0తో మూడోసారి ఓడిపోయింది. తొలి టెస్టులో భారత్‌పై ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన షాన్ పొలాక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆరో నంబర్లో దిగిన సెహ్వాగ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులు చేశాడు. అయితే వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా భారత్ రెండో టెస్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.
2006-07లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో భారత జట్టు నాలుగోసారి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ద్రవిడ్ సారథ్యంలో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్ భారత్‌కు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో మొత్తం 8 వికెట్లు తీశాడు. అయితే తొలి టెస్టులో విజయం సాధించిన భారత జట్టు మిగిలిన రెండు టెస్టుల్లోనూ ఓడిపోయింది.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ రెండుసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. తొలిసారిగా 2010-11లో ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు ఆఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడంలో విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆఫ్రికా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే తర్వాతి టెస్టులో అద్భుతంగా పుంజుకోవడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వీవీఎస్ లక్ష్మణ్ తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేశాడు. జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ చెరి 6 వికెట్లు తీశారు. మూడో టెస్టును భారత్ డ్రా చేసుకోగలిగింది.
2013-14లో ధోనీ కెప్టెన్సీలో భారత్ రెండోసారి ఆఫ్రికాలో పర్యటించింది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా కూడా 153 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఫాఫ్ డు ప్లెసిస్ (134), ఏబీ డివిలియర్స్ (103) ఇన్నింగ్స్‌తో ఆఫ్రికా జట్టు ఈ టెస్టును డ్రా చేసుకోవడంలో సఫలమైంది. రెండో టెస్టు మ్యాచ్‌లో ఆఫ్రికా 10 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. దీంతో సిరీస్ 0-1 తేడాతో ఓడిపోయింది.
మూడేళ్ల క్రితం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ చివరిసారిగా ఆఫ్రికాలో పర్యటించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో ఓడిపోయింది. ఈసారి దక్షిణాఫ్రికాలో భారత జట్టు గెలవాలంటే విరాట్ కోహ్లీ బ్యాటుతో తప్పకుండా అద్భుతం చేయవలసి ఉంటుంది. విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాలో 5 టెస్టుల్లో 55కి పైగా సగటుతో 558 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌పై కోహ్లీ 2 సెంచరీలు, అర్ధసెంచరీలు చేశాడు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.