Women's T20 World Cup 2023 - IND W vs ENG W : ప్రపంచకప్ (World Cup) వేటలో ఉన్న భారత మహిళల జట్టు (India Women's Team) మరో పోరుకు సిద్ధమైంది. అయితే ఈసారి ప్రత్యర్థి అల్లా టప్పా టీం కాదు. మాజీ చాంపియన్స్.. సూపర్ ఫామ్ లో ఉన్న ఇంగ్లండ్ (England). సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 ప్రపంచకప్ 2023 (Women's T20 World Cup 2023) గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా (Team India) నెగ్గితే సెమీఫైనల్స్ కు చేరుకుంటుంది. ఒక వేళ ఓడితే మాత్రం ఐర్లాండ్ (Ireland)తో జరిగే మ్యాచ్ వరకు ఆగాల్సి ఉంటుంది. ఇక ఈ కీలక పోరులో టాస్ నెగ్గిన హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. దేవిక వైద్య స్థానంలో శిఖా పాండేను తీసుకుంది. ఇక ఇంగ్లండ్ మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది.
గ్రూప్ ‘బి’ నుంచి భారత్, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్స్ కు చేరడం పక్కాగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ రెండు జట్లే బలంగా ఉన్నాయి. పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు గ్రూప్ దశ నుంచే ఇంటి దారి పట్టడం ఖాయం. సెమీస్ కు చేరడంతో పాటు కూడా గ్రూప్ ‘బి’లో టాపర్ గా నిలవడం ప్రస్తుతం భారత్ ముందున్న లక్ష్యం. గ్రూప్ టాపర్ గా ఉండాలంటే ఇంగ్లండ్ పై టీమిండియా నెగ్గాలి. అప్పుడు గ్రూప్ ‘బి’లో భారత్ తొలి స్థానానికి చేరుతుంది. గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియా టాపర్ హోదాలో సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సందర్భంలో గ్రూప్ విన్నర్ హోదాలో భారత్.. గ్రూప్ ‘ఎ’ రన్నరప్ తో ఆడుతుంది. దాంతో ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుతో సెమీస్ ఆడే అవకాశం ఉండదు. దాంతో భారత్ ఫైనల్స్ కు చేరడం సులభం అవుతుంది. ఇక తుది పోరులో ప్రత్యర్థి ఎవరైనా 100 శాతం ప్రదర్శన చేసేందుకు భారత్ కు అవకాశం లభిస్తుంది.
అయితే ఇంగ్లండ్ తో అంతర్జాతీయ టి20ల్లో భారత్ రికార్డు ఏ మాత్రం బాగాలేదు. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 26 మ్యాచ్ లు జరిగితే.. అందులో ఇంగ్లండ్ 19 సార్లు నెగ్గిది. 7 సార్లు భారత్ విజేతగా నిలిచింది. ఇక ప్రపంచకప్ లలో ఇరు జట్లు 5 సార్లు ఆడితే భారత్ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు.
తుది జట్లు
టీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, దీప్తి శర్మ, శిఖా పాండే, పుజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక సింగ్
ఇంగ్లండ్
డానీ వ్యాట్, సోపియా డంక్లీ, క్యాప్సీ, నాట్ సీవర్ (కెప్టెన్), అమీ జోన్స్, మయా బొచైర్, కేథరిన్ బ్రంట్, సోఫీ ఎకెల్ స్టోన్, కెంప్, వొంగ్, సారా గ్లెన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND VS ENG, India vs england, Smriti Mandhana, South Africa, Womens T20 World Cup