IND vs WI 2nd ODI : భారత్ (India), వెస్టిండీస్ (West Indies) జట్ల మధ్య మరోసారి ఉత్కంఠ పోరు జరిగింది. తొలి వన్డేకు ఏ మాత్రం తగ్గకుండా సాగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్లో టీమిండియా విజయానికి 8 పరుగులు అవసరం కాగా.. తొలి మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే లభించాయి. అయితే నాలుగో బంతిని భారీ సిక్సర్ బాదిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) భారత్ కు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.4 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 312 పరుగులు చేసింది. ఫలితంగా వెస్టిండీస్ పై 2 వికెట్ల తేడాతో రెండో వన్డేలో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-1తో సొంతం చేసుకుంది. అక్షర్ పటేల్ (35 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సునామీ తరహా ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 63; 4 ఫోర్లు, 1 సిక్స్), సంజూ సామ్సన్ (51 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), దీపక్ హుడా (36 బంతుల్లో 33; 2 ఫోర్లు) చక్కటి సహకారం అందించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్ చెరో రెండు వికెట్లు సాధించారు.
312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్ (13), శుబ్ మన్ గిల్ (43) మరోసారి శుభారంభం చేశారు. వీరు తొలి వికెట్ కు 48 పరుగులు జోడించారు. అయితే ధావన్ ఈసారి తక్కువ స్కోరుకే పెవిలియన్ కు చేరాడు. కాసేపటికే గిల్ కూడా అవుటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (9) మరోసారి విఫలం అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులో జతకలిసిన శ్రేయస్ అయ్యర్, సంజూ సామ్సన్ జట్టును ఆదుకున్నారు. వీరు నిలకడగా ఆడుతూ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరు నాలుగో వికెట్ కు 99 పరుగులు జోడించారు. అనంతరం అయ్యర్ అవుటవ్వగా.. సమన్వయ లోపంతో సంజూ సామ్సన్ పెవలియన్ కు చేరాడు. కాసేపటికే దీపక్ హుడా కూడా అవుటయ్యాడు.
అక్షర్ ధనాధన్
ఈ సమయంలో అక్షర్ పటేల్ టి20 తరహా షాట్లతో రెచ్చిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. దీపక్ హుడాతో కలిసి 51 పరుగులు జోడించిన అక్షర్.. హుడా అవుటైన తర్వాత కూడా జట్టును ముందుకు నడిపాడు. కీలక సమయంలో అవేశ్ ఖాన్ రెండు బౌండరీలు సాధించాడు. అయితే భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. అయితే చివరి ఓవర్లో ఎటువంటి ఒత్తిడికి గురి కాని అక్షర్ మేయర్స్ వేసిన నాలుగో బంతిని సిక్సర్ బాది సిరీస్ ను భారత్ వశం చేశాడు. అక్షర్ పటేల్ కు ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‘ అవార్డు లభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, India Vs Westindies, Mohammed Siraj, Rahul dravid, Sanju Samson, Shikhar Dhawan, Shreyas Iyer, Team India, West Indies