ఇంగ్లండ్ గడ్డపై వన్డే, టీ20 సిరీస్ లు కైవసం చేసుకుని దుమ్మురేపిన టీమిండియా.. విండీస్ (India vs West Indies) తో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) కెప్టెన్సీలోని భారత వన్డే జట్టు నేడు ఫస్ట్ వన్డే ఆడనుంది. ఈ వన్డే సిరీస్‌కి భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) దూరంగా ఉన్నారు. వారికి రెస్ట్ ఇచ్చినట్లు సెలెక్టర్లు చెప్పుకొచ్చారు.ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ని 27 వరకూ ఆడనున్న టీమిండియా (Team India).. ఆ తర్వాత 29 నుంచి ఆగస్టు 7 వరకూ ఐదు టీ20ల సిరీస్‌ని ఆడనుంది.
వన్డే సిరీస్‌లో జట్టుని శిఖర్ ధావన్ నడిపించనుండగా.. టీ20 సిరీస్ సమయానికి కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు రిషబ్ పంత్ కూడా అక్కడికి వెళ్లనున్నారు. భారత్ జట్టు చివరిగా 2019లో వెస్టిండీస్ గడ్డపై పర్యటించింది. అప్పట్లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడిన టీమిండియా.. టెస్టు సిరీస్‌ని 2-0తో, వన్డే సిరీస్‌ని 2-0తో, టీ20 సిరీస్‌ని 3-0తో కైవసం చేసుకుంది.
అయితే.. ఈ మ్యాచులు చూడాలనుకునేవారు ఏ ఛానెల్లో చూడాలని సెర్చ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు ఇండియా ఆడే మ్యాచ్‌లు డిస్నీ హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారమయ్యేవి. ఇంగ్లండ్‌తో ఇటీవలే ముగిసిన మూడు వన్డేల సిరీస్ సోనీ లివ్‌లో వచ్చింది. మరి ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆడబోయే వన్డే మ్యాచ్‌లు మాత్రం ఏ ప్రైవేట్ ఛానెల్‌లో కూడా రావు. అసలు ప్రైవేట్ శాటిలైట్ ఛానెళ్లలో విండీస్-ఇండియా మ్యాచ్ చూడటం కుదరని పని. మరెలా..? అనుకుంటున్నారా..
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ దేశంలో ఆడబోయే మ్యాచులన్నింటినీ ప్రసారం చేయడానికి FanCode అనే యాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఫ్యాన్ కోడ్ అనేది ఆ బోర్డుకు అధికారిక ప్రసారదారు. ఇదొక Sports OTT ఛానెల్. వెస్టిండీస్ స్వదేశంలో ఆడే మ్యాచులన్నీ ఇందులోనే ప్రసారమవుతాయి. ఈ మేరకు ఫ్యాన్ కోడ్.. విండీస్ బోర్డుతో గతేడాది ఒప్పందం (2024 వరకు) కుదుర్చుకుంది.
ఇది కూడా చదవండి : ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ లో ఆడే జట్లు ఇవే.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
భారత్‌లో అయితే..
ప్రైవేట్ శాటిలైట్ ఛానెళ్లు లేకపోవడంతో భారత్ లోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లను ప్రభుత్వ అధికారిక ప్రసారదారు దూరదర్శన్‌లో వీక్షించొచ్చు. DD Sports 1.0 లో ఈ మ్యాచ్‌లను చూసే వీలుంది. ఈ మేరకు ఫ్యాన్ కోడ్-డీడీ స్పోర్ట్స్‌తో జతకలిసింది. ఈ ఒప్పందంలో భాగంగా యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 75:25 నిష్పత్తిలో పంచుకునేందుకు ఒప్పందం కుదిరింది. మూడు మ్యాచులు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ ఓవల్ పార్క్‌లో జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.
వెస్టిండీస్ గడ్డపైకి చేరుకున్న భారత వన్డే జట్టు ఇదే: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్ధూల్ ఠాకూర్, యుజ్వేందర్ చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IND vs WI, India Vs Westindies, Ravindra Jadeja, Shikhar Dhawan, Shreyas Iyer, Team India