IND vs SL: " భారత్-బీ టీమే ఇప్పుడు చిత్తు చేసింది " .. మీమ్స్‌తో విమర్శకులను ఆటాడుకుంటున్న నెటిజన్లు

టీమిండియా

IND vs SL: తొలి వన్డే జరగక ముందు శ్రీలంక మాజీ ఆటగాడు అర్జున రణతుంగ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక జట్టుని ఎదుర్కోవడానికి భారత్-బీ టీమ్‌ని బీసీసీఐ పంపిందని.. ఇలాంటి ద్వితీయ శ్రేణి భారత జట్టుతో ఆడటం శ్రీలంక టీమ్‌కి అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు.

  • Share this:
శ్రీలంక, భారత్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతంగా ఆడి క్రీడా అభిమానులను ఫిదా చేశారు. ఈ వన్డేలో ఏడుగురు ఇండియన్ ఆటగాళ్లను తక్కువ పరుగులకే ఔట్ చేసిన శ్రీలంక జట్టు మంచి కమ్ బ్యాక్ ఇచ్చినట్లే కనిపించింది. అప్పటికి టీమిండియా స్కోరు 193 కాగా.. గెలవాలంటే ఇంకా 83 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో భారత్ కి ఓటమి తప్పదని అందరూ భావించారు కానీ ఆ సమయంలోనే మైదానంలోకి దిగిన చాహర్‌, భువనేశ్వర్‌ చాలా జాగ్రత్తగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయారు. చాహర్‌ 82 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ బాది 69 నాటౌట్‌ గా నిలిచాడు. భువనేశ్వర్ 28 బంతుల్లో 2 ఫోర్లు బాది 19 నాటౌట్‌ గా నిలిచాడు. దీంతో భారత్ 3 వికెట్ల తేడాతో ఎవరూ ఊహించని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ గెలుపొందడంతో టీమిండియా శ్రీలంకపై 2-0 తేడాతో సిరీస్‌ గెలిచింది.తొలి వన్డే జరగక ముందు శ్రీలంక మాజీ ఆటగాడు అర్జున రణతుంగ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక జట్టుని ఎదుర్కోవడానికి భారత్-బీ టీమ్‌ని బీసీసీఐ పంపిందని.. ఇలాంటి ద్వితీయ శ్రేణి భారత జట్టుతో ఆడటం శ్రీలంక టీమ్‌కి అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అయితే ఆయన ఎద్దేవా చేసిన జట్టే ఈరోజు శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ అర్జున రణతుంగ ని బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు.

పార్ట్ టైమ్ బ్యాట్స్‌మెన్లుగా పేరు తెచ్చుకున్న చాహర్‌, భువనేశ్వర్‌ అద్భుతంగా రన్ చేజ్ చేసి ఇండియాని విజయ తీరాల వైపు నడిపించడంతో అభిమానులు వారిద్దరినీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. శ్రీలంక ఆత్మవిశ్వాసాన్ని చెదరగొడుతూ బీ-టీమ్ అద్భుతమైన విజయాన్ని సాధించిందంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

టీమిండియా గెలవడం అసాధ్యం అనుకున్నామని కానీ యువ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన విజయం అందించారని నెటిజన్స్ తెగ పొగుడుతున్నారు. ఇండియా బీ-టీమ్ కి రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌ గా వ్యవహరించారు. ఆయన కోచింగ్ లో యువ ఆటగాళ్లు తమ బ్యాటింగ్‌పై నమ్మకం పెంచుకున్నారు. అందువల్లే ఈరోజు టీమ్‌ఇండియా విజయం సాధించింది. రాహుల్‌ ద్రవిడ్‌ ని నేషనల్ టీం కోచ్ గా నియమించాలి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ధావన్‌ కెప్టెన్సీలో దీపక్‌ చాహర్‌ ధోనీలా ఆడారని మీమ్స్ క్రియేట్ చేసి మరీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. ఈ ఒక్క మ్యాచ్ తో చాహర్‌ క్రేజ్ మరింత పెరిగి పోయిందని మరి కొందరు ఫన్నీ మెయిల్ క్రియేట్ చేసి సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.


ఇక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్ కూడా తాజా విషయంపై స్పందించారు.‌ ఓటమిని ఒప్పుకోనటువంటి మనస్తత్వంతో యువ ఆటగాళ్లు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించారని ఆయన మెచ్చుకున్నారు. టీమిండియా జట్టులోని కుర్ర ఆటగాళ్ళందరూ ఈ మ్యాచ్ ఒక పాఠమని అభివర్ణించారు. ఇటువంటి మ్యాచ్‌ల వల్ల కుర్రాళ్లకు మంచి అనుభవం లభిస్తుందని ఆయన అన్నారు.
Published by:Sridhar Reddy
First published: