IND vs SL: శ్రీలంక (Sri lanka)తో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా (Team India) అదరగొట్టిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో శ్రీలంక జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో మట్టికరిపించిన భారత్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ పలు ప్రత్యేకతలకు కూడా వేదికైంది. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)కి టెస్టుల్లో 100వ మ్యాచ్ కావడం... కెప్టెన్ గా రోహిత్ శర్మకు టెస్టుల్లో తొలి మ్యాచ్ కావడం వంటివి ప్రత్యేక ఆకర్షణలుగా మిగిలాయి. మ్యాచ్ ఆరంభానికి ముందు వరకు కూడా ఈ రెండు విషయాల గురించే భారత అభిమానులు ఎక్కువగా మాట్లాడుకున్నారు. అయితే మ్యాచ్ ఆరంభమైన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అటు బ్యాట్ తో ఇటు బంతితో చెలరేగిపోయాడు. అలా ఇలా కాదు తొలుత 175 పరుగులతో అజేయ సెంచరీ చేసి... అనంతరం 9 వికెట్ల (రెండు ఇన్నింగ్స్ లలో కలిపి)తో ప్రత్యర్థిని తిప్పేశాడు. ఈ క్రమంలో అతడు అరుదైన రికార్డులను సాధించేశాడు.
సెంచరీతో పాటు 5 వికెట్లు తీసిన నాలుగో భారత ప్లేయర్ గా
టెస్టుల్లో టీమిండియా తరఫున ఒకే మ్యాచ్ లో సెంచరీతో పాటు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా జడేజా ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఇప్పటి వరకు దిగ్గజ ప్లేయర్ వినూ మన్కడ్ (184 పరుగులు, 5 వికెట్లు), పాలి ఉమ్రిగర్ (172 నాటౌట్; 5 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) లు ఉన్నారు. వినూ మన్కడ్ 1952లో ఇంగ్లండ్ పై ఈ ఘనత సాధిస్తే... పాలీ ఉమ్రిగర్ 1962లో వెస్టిండీస్ పై సాధించాడు. ఇక అశ్విన్ అయితే ఏకంగా మూడు సార్లు ఒకే మ్యాచ్ లో సెంచరీతో పాటు 5 అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. 2011లో వెస్టిండీస్ పై 103 పరుగులతో పాటు 5 వికెట్లు తీసిన అశ్విన్... 2016లో మళ్లీ వెస్టిండీస్ పైనే 113 పరుగులతో పాటు 7 వికెట్లు తీశాడు. ఇక గతేడాది ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ 106 పరుగులు చేసిన అశ్విన్ 5 వికెట్లు తీశాడు. తాజాగా రవీంద్ర జడేజా వీరి సరసన నిలిచాడు.
కపిల్ రికార్డును బద్దలు కొట్టిన అశ్విన్
ఇక రవిచంద్రన్ అశ్విన్ మరో మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో మగిసిన తొలి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా అశ్విన్ ఈ రికార్డును అందుకున్నాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో చరిత్ అసలంక వికెట్ ను తీయడం ద్వారా వెటరన్ స్పిన్నర్ అశ్విన్... తన టెస్టు కెరీర్ లో 435వ వికెట్ ను సాధించాడు. దాంతో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో కపిల్ దేవ్ (434 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil kumble) 619 వికెట్లతో ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, India vs srilanka, Ravindra Jadeja, Rohit sharma, Sri Lanka, Team India, Virat kohli