IND vs SL: టీమిండియా (Team India) వైస్ కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit bumrah) దెబ్బకు బెంగళూరు (Bengaluru)లో శ్రీలంక (Sri lanka) టీం గల్లంతైంది. కేవలం 24 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడంతో ఆ జట్టు రెండో రోజు ఆట ఆరంభమైన అరగంట లోపే 35.5 ఓవర్లలో 109 పరగులకు ఆలౌటైంది. దాంతో ఓవర్ నైట్ స్కోరు 86/6తో రెండో రోజు ఆట మొదలు పెట్టిన శ్రీలంక తమ ఓవర్ నైట్ స్కోరుకు మరో 23 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. చివరి నాలుగు వికెట్లలో రెండు వికెట్లను బుమ్రా దక్కించుకోవడం విశేషం. శ్రీలంక బ్యాటర్లలో మ్యాథ్యూస్ (85 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్ లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. నిరోషన్ డిక్ వెల్లా (38 బంతుల్లో 21; 3 ఫోర్లు) సెకండ్ టాప్ స్కోరర్ కావడం గమనార్హం. భారత్ కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. తొలి రోజు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 252 పరగులలకు ఆలౌటైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే తడబడింది. 29 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (15), మయాంక్ అగర్వాల్ (4) మరోసారి నిరాశపరిచారు. ఆ తర్వాత హనుమ విహారీ, విరాట్ కోహ్లీ కాసేపు ఆడారు. జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ జయ విక్రమ బౌలింగ్‌లో హనుమ విహారీ (31), డిసిల్వా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (23) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. దీంతో టీ బ్రేక్ సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. 29 ఓవర్లపాటు సాగిన తొలి సెషన్‌లో శ్రీలంక బౌలర్లే అధిపత్యం చెలాయించారు.
టీ బ్రేక్ తర్వాత ప్రారంభమైన సెకండ్ సెషన్‌లో టీమిండియాను శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నాడు. మిగతా వారెవరూ సహకరించకపోయినప్పటికీ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అయ్యర్‌కు తోడుగా దూకుడుగా ఆడిన పంత్ 26 బంతుల్లోనే 39 పరుగులు చేసిన ఎంబుల్డేనియా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. పంత్ ఔటయ్యాక బ్యాటింగ్ బాధ్యత అంతా తన భుజాన వేసుకోని శ్రేయస్ అయ్యర్ ఆడాడు. ఈ క్రమంలో 54 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా టీమిండియాను ఆదుకున్నాడు.
జడేజా (4), అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9), మహ్మద్ షమీ (5) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయినా శ్రేయస్ అయ్యర్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు సునాయసంగా పరుగులు రాబట్టడం గమనార్హం. ఈ క్రమంలో జట్టు స్కోర్‌ను అయ్యర్ 200 దాటించాడు. పంత్‌తో కలిసి 40 పరుగులు, జడేజాతో కలిసి 22 పరుగులు, అశ్విన్‌తో కలిసి 35 పరుగులు, అక్షర్ పటేల్‌తో కలిసి 32 పరుగులు, షమీతో కలిసి 14 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఓ దశలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయడం ఖాయంగానే కనిపించింది. కానీ వికెట్లు లేకపోవడంతో ముందుకొచ్చి భారీ షాట్‌కు ప్రయత్నించిన అయ్యర్ బాల్ మిస్సవడంతో స్టంపౌట్ అయ్యాడు. ఈ క్రమంలో సెంచరీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. మొత్తంగా 98 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 10 ఫోర్లు, 4 సిక్సులతో 92 పరుగులు చేశాడు. అయ్యర్ ఔట్‌తో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు 59 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దేనియా, జయవిక్రమ మూడేసి వికెట్లు, డిసిల్వా 2, లక్మల్ ఒక వికెట్ తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangalore, Sri Lanka, Team India