రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలోని టీమిండియా (Team India) సొంతగడ్డపై దుమ్మురేపుతోంది. విండీస్ ను చిత్తు చేసిన టీమిండియా.. శ్రీలంకకు కూడా అదే మెడిసిన్ ఇస్తోంది. లంకతో (IND vs SL) తొలి టీ20లో 62 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈ శనివారం రెండో టీ20 ఆడనుంది. ఫస్ట్ టీ20లో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన రోహిత్ సేన.. ధర్మశాల వేదికగా జరగనున్న రెండో టీ20లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకొని చివరి మ్యాచ్‌లో బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకుంటుంది. అయితే, జోరు మీదున్న టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, సూర్యకుమార్ యాదవ్‌లు భారత జట్టకు దూరమయ్యారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో యంగ్ క్రికెటర్ చేరాడు.
టీమిండియా యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)ను మరోసారి దురదృష్టం వెంటాడింది. లంకతో టి20 సిరీస్‌కు ఎంపికైన రుతురాజ్ గాయంతో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తొలి టి20లో బెంచ్‌కే పరిమితమైన రుతురాజ్ రెండో టి20లో జట్టులో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. కానీ రుతురాజ్‌కు కుడిచేయి మణికట్టు గాయం తిరగబెట్టిందని.. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తోందన్నారు. గాయం తీవ్రత తేలకపోవడంతో మిగతా మ్యాచ్‌లకు రుతురాజ్ దూరమయ్యాడని తెలిపారు.
రుతురాజ్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. దీంతో చండీఘర్‌లో ఉన్న మయాంక్ ధర్మశాలలో ఉన్న టీమ్‌తో జాయిన్ అయ్యాడు. మయాంక్ జట్టుతో కలిసినప్పటికి బయోబబూల్‌లో ఉంటాడని బీసీసీఐ పేర్కొంది. అయితే, రుతురాజ్ ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టి20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న ఈ యంగ్ క్రికెటర్ కు ధనాధన్ ఫార్మాట్ లో మంచి రికార్డు ఉంది. గతేడాది సీజన్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. దీంతో, భారత్ తరఫున భవిష్యత్తులో స్టార్ ఆటగాడి అవుతాడని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న అప్‌కమింగ్ టీ20 వరల్డ్‌కప్‌నే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు.. దానికి అనుగుణంగా రోడ్ మ్యాప్ సిద్దం చేసుకుంటుంది. ముందుగా టీమ్ కాంబినేషన్‌పై ఫోకస్ పెట్టింది. సీనియర్ ప్లేయర్స్ కోహ్లీ, పంత్‌కు రెస్ట్ ఇవ్వడంతో పాటు గాయం నుంచి కోలుకున్న జడేజా, విశ్రాంతిని ముగించుకొని బుమ్రా అందుబాటులోకి రావడంతో టీమిండియా ఫస్ట్ టీ20లో భారీ మార్పులతో బరిలోకి దిగింది. మరీ రెండో టీ20లో అదే జట్టును కొనసాగిస్తుందా? లేక ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇస్తుందా? అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs srilanka, Jasprit Bumrah, Ravindra Jadeja, Rohit sharma, Team India