బెంగళూరు వేదికగా ప్రారంభమైన పింక్ బాల్ టెస్ట్ (Pink Ball Test) మ్యాచ్ తొలి రోజు ఆటలో బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో తొలి రోజు ఏకంగా 16 వికెట్లు నెలకులాయి. అదే సమయంలో పరుగులు కూడా బాగానే వచ్చాయి. 89.1 ఓవర్ల పాటు సాగిన తొలి రోజు ఆటలో ఇరు జట్లు కలిసి 338 పరుగులు చేశాయి. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) 92 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 98 బంతుల్లోనే 92 పరుగులు చేసిన అయ్యర్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఇతరులెవరూ సహకరించకపోయినప్పటికీ శ్రేయస్ ఒంటరి పోరాటం చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. మిగతా బ్యాటర్లలో రిషబ్ పంత్ 39 (7 పోర్లు) , హనమ విహారీ 31 (4 ఫోర్లు), కోహ్లీ 23 (2 ఫోర్లు), రోహిత్ శర్మ 15 (ఒక ఫోర్, ఒక సిక్సు), అశ్విన్ 13 (ఒక ఫోర్), అక్షర్ పటేల్ 9, షమీ 5, మయాంక్ అగర్వాల్ 4, రవీంద్ర జడేజా 4 పరుగులు చేశారు. ఇక, పింక్ టెస్టులోనైనా సత్తా చాటుతారని భావించినా రోహిత్, కోహ్లీలు నిరాశపర్చారు.
అయితే, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ (Rohit Sharma) తక్కువ పరుగులకే ఔటై ఉండొచ్చుగానీ.. ఇన్నింగ్స్ లో అతడు కొట్టిన సిక్స్ మాత్రం హైలైట్. శ్రీలంక ఎడమ చేతి వాటం పేసర్ విశ్వ ఫెర్నాండో వేసిన బంతిని.. చాలా అందంగా లాఫ్టెడ్ షాట్ తో సిక్సర్ గా మలిచాడు. అయితే, ఈ సిక్సర్ ఓ అభిమాని ప్రాణాల మీదకి తెచ్చింది. స్టాండ్ లో పడిన బంతితో ఓ ప్రేక్షకుడి ముక్కు పగిలింది.
ఇది కూడా చదవండి : సన్ రైజర్స్ టీంపై అభిమానుల గుస్సా... హైదరాబాద్ జట్టేనా అంటూ ఆగ్రహం...
డి కార్పొరేట్ బాక్స్ లో కూర్చున్న 22 ఏళ్ల ఆ క్రికెట్ అభిమానికి ఆ బంతి తగిలింది. తగిలిన వెంటనే నొప్పితో విలవిల్లాడిపోయాడు. దీంతో, ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. బాగా రక్తం కారడంతో వెంటనే అతడిని హస్మత్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్ రే తీయడంతో.. ముక్కు ఎముక విరిగిందని తేలింది. గాయానికి వైద్యులు కుట్లు వేశారు. పెద్దగా ప్రమాదమేమీ లేదని, రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
అయితే, గుండప్ప విశ్వనాథ్ జీవిత చరిత్ర పుస్తకం విడుదల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో దిగ్గజాలు ఒక్కచోట కలిశారు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, అన్షుమాన్ గైక్వాడ్, రోజర్ బిన్నీ, బ్రజేశ్ పటేల్, శాంతా రంగస్వామి వంటి ప్రముఖులు కలిసి విశ్వనాథ్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఇక, ఈ పింక్ టెస్ట్ మ్యాచ్ రోహిత్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ లాంటిది. రోహిత్ కిది అన్ని ఫార్మాట్లలో కలిపి 400 వ అంతర్జాతీయ మ్యాచ్. ఇక, రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్ లో 1-0తో ముందంజలో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.