శ్రీలంక పై వరుస విజయాలతో దూసుకెళ్తోన్న భారత్ (Team India) ఈ నెల 12 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే పింక్ టెస్ట్ (Pink Test) మ్యాచుకు సై అంటోంది. ఇప్పటికే తొలి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి జోరు మీదున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అటు తొలి టెస్ట్ మ్యాచ్‌లో దారుణ పరాభావం పాలైన శ్రీలంక (Sri Lanka) రెండో టెస్ట్‌లో పుంజుకోవాలని భావిస్తోంది. అయితే ఇది పింక్ బాల్ టెస్టు మ్యాచ్ కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. గులాబీ బంతితో జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా గత మ్యాచ్ లో లాగే ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్ల పాలసీని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అయితే, జట్టులో ఒక కీలక మార్పు జరిగే ఛాన్సు ఉంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.
ఫస్ట్ టెస్ట్ లో పుజారా, రహానే స్థానాల్ని భర్తీ చేసిన హనుమ విహారీ, శ్రేయస్ అయ్యర్ ప్లేసులకు ఎటువంటి ఢోకా లేదు. యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ కు మరో నిరాశ ఎదురయ్యే ఛాన్సు ఉంది. అయితే, ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తర్వాత.. హనుమ విహారి మూడో స్ధానంలో బ్యాటింగ్ కు రావడం ఖాయం. గత మ్యాచులానే.. కోహ్లీ, పంత్, శ్రేయస్ లు నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు దిగనున్నారు. ఆ తర్వాత రవీంద్ర జడేజాను ఏడో స్థానంలో ఆడతాడు.
ఇక, ఫస్ట్ టెస్టులో చోటు దక్కించుకున్న జయంత్ యాదవ్ పై వేటు పడనుంది. అతని స్థానంలో అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకోనే ఛాన్సుంది. ఇటీవలే.. గాయం నుంచి కోలుకున్న అక్షర్ పటేల్ ని టీమిండియా స్క్వాడ్ లో చేర్చారు బీసీసీఐ సెలెక్టర్లు. పింక్ బాల్ తో అక్షర్ పటేల్ చాలా డేంజరస్ బౌలర్. మరోవైపు.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ బౌలింగ్ బాధ్యతల్ని మోయనున్నారు. బుమ్రా, షమీ కొత్త బంతిని పంచుకున్నాడు. ఇక, మూడు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది టీమిండియా. అశ్విన్, జడేజా, అక్షర్ స్పిన్ బాధ్యతల్ని మోయనున్నారు. ఒకవేళ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే సిరాజ్ కు తుది జట్టులో చోటు దక్కవచ్చు.
ఇది కూడా చదవండి : ధోనికి ఘోర అవమానం.. మరీ ఇంతలా దిగజారాలా..!
ఇక, ఇప్పటివరకు టీమిండియా 3 డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 గెలిచి, ఒకటి ఓడిపోయింది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించగా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోల్‌కతా వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ 136 పరుగులు చేశాడు. అటు ప్రస్తుతం టీమిండియాతో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోయే శ్రీలంక కూడా ఇప్పటివరకు 3 పింక్ బాల్ టెస్టులు ఆడి రెండు గెలిచి, ఒకటి ఓడింది.
తుది జట్టు అంచనా :
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ , అక్షర్ పటేల్ / మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.