IND VS SL PINK TEST LIVE UPDATES TEAM INDIA WON BY 238 RUNS AND CLINCHES SERIES 2 0 SRD
IND vs SL Pink Test : తగ్గేదే లే.. లంకను వైట్ వాష్ చేసిన టీమిండియా.. లంక కెప్టెన్ పోరాటం వృధా..
Team India ( PC : BCCI)
IND vs SL Pink Test : రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా సొంత గడ్డపై దుమ్మురేపుతోంది. మరో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటింది టీమిండియా. లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే సూపర్ ఇన్నింగ్స్ వృధా అయింది.
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా దుమ్మురేపింది. 447 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక 208 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. శ్రీలంక కెప్టెన్ (174 బంతుల్లో 104 ; 15 ఫోర్లు) సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. దిముత్ కరుణరత్నే ఒంటరి పోరాటం వృధా అయింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు, బుమ్రా మూడు వికెట్లతో దుమ్మురేపారు. అక్షర్ పటేల్ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు. దీంతో 2 మ్యాచుల సిరీస్ ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా.ఓవర్ నైట్ స్కోరు 28/1 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన లంకకు శుభారంభం లభించింది. రెండో వికెట్ కు కుషాల్ మెండిస్, లంక కెప్టెన్ కరుణరత్నే 97 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. మూడో రోజు ఆరంభం నుంచే దూకుడైన బ్యాటింగ్ తో టీమిండియా బౌలర్లపై ఒత్తిడి పెంచారు లంక బ్యాటర్లు. ఈ క్రమంలో కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కున్న కుశాల్ మెండిస్.. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ వెంటనే వరుసగా వికెట్లు కోల్పోయింది లంక టీమ్.
హాఫ్ సెంచరీ చేసి టచ్ లోకి వచ్చిన కుశాల్ మెండిస్ (54) ను అశ్విన్ బోల్తా కొట్టిస్తే.. సీనియర్ బ్యాటర్ ఏంజెలొ మాథ్యూస్ ను జడ్డూ బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా జోరు పెంచుదామనుకున్న మెండిస్ ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. అశ్విన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడాడు మెండిస్. కానీ అది కాస్తా మిస్ అవ్వడంతో వికెట్ల వెనుక ఉన్న రిషభ్ పంత్.. స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మాథ్యూస్.. ఎదుర్కున్న ఐదో బంతికే జడేజా బౌలింగ్ లో బౌల్డ్ అయి పెవిలియన్ కు చేరాడు.
రెండు ఓవర్ల వ్యవధిలోనే భారత్.. రెండు కీలక వికెట్లు పడగొట్టి లంకపై ఒత్తిడి పెంచింది. ఇక మాథ్యూస్ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన ధనుంజయ డి సిల్వ (4) కూడా ఎక్కువ సేపు నిలువలేదు. అశ్విన్ వేసిన లంక ఇన్నింగ్స్ 27వ ఓవర్లో స్లిప్స్ లో ఉన్న హనుమ విహారి కి చిక్కాడు. ఇది అశ్విన్ కు టెస్టులలో 440వ వికెట్. దీంతో అతడు దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ ను అధిగమించాడు.
ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా.. తనదైన శైలిలో బ్యాటింగ్ తో భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే. అయితే, మరో ఎండ్ లో అతనికి సహాకరించే వారే కరువయ్యారు. టీ విరామం తర్వాత నిరోషన్ డికెవల్లా 12 పరుగులు చేసిన అక్షర్ పటేల్ బౌలింగ్ లో స్టంపౌంట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అసలంక కూడా విఫలమయ్యాడు. ఐదు పరుగులు చేసిన అసలంక అక్షర్ పటేల్ బౌలింగ్ లో రోహిత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. చూడచక్కని షాట్లతో తన శతాకాన్ని పూర్తి చేసుకున్నాడు దిముత్ కరుణరత్నే.
అయితే, సెంచరీ చేసిన తర్వాత ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు లంక కెప్టెన్. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఓ అద్భుతమైన డెలివరీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు దిముత్ కరుణరత్నే. దీంతో, లంక ఆశలు గల్లంతయ్యాయ్. ఆ తర్వాత టెయిలండర్లు ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. లసిత్ ఎంబుల్దోనియాను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. ఇక, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సురంగ లక్మల్ ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక, విశ్వ ఫెర్నాండో అశ్విన్ బౌలింగ్ లో షమీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో శ్రీలంక కథ ముగిసింది. టీమిండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
స్కోరు వివరాలు : భారత్ తొలి ఇన్నింగ్స్ 252, రెండో ఇన్నింగ్స్ 303-9 డిక్లేర్డ్
శ్రీలంక : తొలి ఇన్నింగ్స్ 109 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ : 208 ఆలౌట్
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.