బెంగళూరు వేదికగా జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. భారత పేస్ బౌలర్ల బౌలింగ్ కి శ్రీలంక బ్యాటర్ల బెంబెలెత్తిపోయారు. దీంతో ఫస్ట్ రోజు ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది లంక జట్టు. ఇంకా 166 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో నిరోషాన్ డికెవెల్లా (29 బంతుల్లో 13 పరుగులు), లసిత్ ఎంబుల్దెనియా (0) ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ షమీ 2 రెండు వికెట్లతో దుమ్మురేపాడు. అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. మాథ్యూస్ (85 బంతుల్లో 43 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మిగతా టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. టీమిండియా 252 పరుగుల ఆలౌట్ తర్వాత తమ ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయ్. 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుషాల్ మెండిస్ (2), తిరుమన్నెలను బుమ్రా పెవిలియన్ కు పంపగా.. లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె(4) ను మహ్మద్ షమీ ఔట్ చేశాడు. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో లంక వికెట్లు కోల్పోయింది.
ధనంజయ (10)ను షమీ ఔట్ చేయగా.. అసలంక (5)ను అక్షర్ పటేల్ పెవిలియన్ బాట పట్టించాడు. ఇక, అద్బుతంగా ఆడుతున్న మాథ్యూస్ ఓ సూపర్ డెలివరీతో బోల్తా కొట్టించాడు బుమ్రా. ఇక, అంతకుముందు ధనాధన్ ఇన్నింగ్స్‌తో శ్రేయస్ అయ్యర్ టీమిండియాకు మంచి స్కోరు అందించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోటు జట్టును ఆదుకోవడమే కాకుండా భారీ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను మంచి స్థితిలో నిలబెట్టాడు. 98 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సులు సహాయంతో అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. శ్రేయస్ దూకుడుతో 30 ఓవర్లపాటు సాగిన రెండో సెషన్‌లో 6 వికెట్లు కోల్పోయినప్పటికీ టీమిండియా ఏకంగా 5కు పైగా రన్‌రేట్‌తో 159 పరుగులు రాబట్టింది. ఈ సెషన్‌లో పరుగుల వరద పారిందనే చెప్పుకోవాలి.
That's STUMPS on Day 1 of the 2nd Test. Sri Lanka 86/6, trail #TeamIndia (252) by 166 runs. Scorecard - https://t.co/t74OLq7xoO #INDvSL @Paytm pic.twitter.com/Xehkffunwn
— BCCI (@BCCI) March 12, 2022
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే తడబడింది. 29 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (15), మయాంక్ అగర్వాల్ (4) మరోసారి నిరాశపరిచారు. ఆ తర్వాత హనుమ విహారీ, విరాట్ కోహ్లీ కాసేపు ఆడారు. జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ జయ విక్రమ బౌలింగ్‌లో హనుమ విహారీ (31), డిసిల్వా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (23) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. దీంతో టీ బ్రేక్ సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. 29 ఓవర్లపాటు సాగిన తొలి సెషన్‌లో శ్రీలంక బౌలర్లే అధిపత్యం చెలాయించారు.
టీ బ్రేక్ తర్వాత ప్రారంభమైన సెకండ్ సెషన్‌లో టీమిండియాను శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నాడు. మిగతా వారెవరూ సహకరించకపోయినప్పటికీ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అయ్యర్‌కు తోడుగా దూకుడుగా ఆడిన పంత్ 26 బంతుల్లోనే 39 పరుగులు చేసిన ఎంబుల్డేనియా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. పంత్ ఔటయ్యాక బ్యాటింగ్ బాధ్యత అంతా తన భుజాన వేసుకోని శ్రేయస్ అయ్యర్ ఆడాడు. ఈ క్రమంలో 54 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా టీమిండియాను ఆదుకున్నాడు.
జడేజా (4), అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9), మహ్మద్ షమీ (5) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయినా శ్రేయస్ అయ్యర్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు సునాయసంగా పరుగులు రాబట్టడం గమనార్హం. ఈ క్రమంలో జట్టు స్కోర్‌ను అయ్యర్ 200 దాటించాడు. పంత్‌తో కలిసి 40 పరుగులు, జడేజాతో కలిసి 22 పరుగులు, అశ్విన్‌తో కలిసి 35 పరుగులు, అక్షర్ పటేల్‌తో కలిసి 32 పరుగులు, షమీతో కలిసి 14 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఓ దశలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయడం ఖాయంగానే కనిపించింది. కానీ వికెట్లు లేకపోవడంతో ముందుకొచ్చి భారీ షాట్‌కు ప్రయత్నించిన అయ్యర్ బాల్ మిస్సవడంతో స్టంపౌట్ అయ్యాడు. ఈ క్రమంలో సెంచరీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. మొత్తంగా 98 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 10 ఫోర్లు, 4 సిక్సులతో 92 పరుగులు చేశాడు. అయ్యర్ ఔట్‌తో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు 59 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దేనియా, జయవిక్రమ మూడేసి వికెట్లు, డిసిల్వా 2, లక్మల్ ఒక వికెట్ తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.