తన బర్త్ డే రోజున ఇషాన్ కిషన్ తన సూపర్బ్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. దీంతో ఫస్ట్ వన్డేలోనే కొన్ని రికార్డుల్ని తన పేరిట లిఖించుకున్నాడు. తన అరంగేట్ర వన్డేలోనే హాఫ్ సెంచరీ బాదాడు ఈ కుర్రాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ అరంగేట్రంలోనే అర్ధ శతకం (53; 34 బంతుల్లో 8x4, 2x6) సాధించాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో అరంగేట్రంలో వేగంగా అర్ధ శతకం చేసిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా 26 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. రోలాండ్ బుట్చేర్, జాన్ మోరిస్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతే గాక బర్త్ డే రోజు వన్డే అరంగేట్ర మ్యాచ్ లోనే అర్థసెంచరీ బాదిన తొలి ప్లేయర్ గా ఇషాన్ కిషన్ రికార్డు సాధించాడు. శ్రీలంక సెట్ చేసిన 263 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు చక్కని శుభారంభం లభించింది. కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కలిసి ఆరంభించిన యువ ఓపెనర్ పృథ్వీ షా (43: 24 బంతుల్లో 9×4) వరుస ఫోర్లతో శ్రీలంక బౌలర్లకి కాసేపు చెమటలు పట్టించేశాడు. షా క్రీజులో ఉన్నంతసేపు వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. ఓ సమయంలో హ్యాట్రిక్ ఫోర్లు కూడా బాదాడు. అతడి దెబ్బకు 5 ఓవర్లలోనే స్కోరు 55 పరుగులు దాటింది. 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షా.. 9 ఫోర్లతో 43 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ధనంజయ వేసిన 5.3 ఓవర్‌కు భారీ షాట్ ఆడబోయి అవిష్క ఫెర్నాండో చేతికి చిక్కాడు. దాంతో భారత్ 58 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్, ఫోర్‌గా మలిచాడు. కిషన్ కూడా హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. టీ20 మాదిరి ఆడుతూ శ్రీలంక బౌలర్లతో చెడుగుడు ఆడాడు. ఈ క్రమంలోనే 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో ఇషాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20, వన్డే ఫార్మాట్లలోనూ అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే శతకొట్టేలా కనిపించిన కిషన్ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సందకన్ బౌలింగ్‌లో భానుకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇక, మరోవైపు ఆచి తూచి ఆడుతున్న టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం క్రీజులో శిఖఱ్ ధావన్, మనీశ్ పాండే ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 26 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs srilanka, Prithvi shaw, Shikhar Dhawan