IND vs SL : తొలి వన్డే టీమిండియాదే..కుర్రాళ్ల మెరుపు బ్యాటింగ్ తో లంక చిత్తు..గబ్బర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్..

IND vs SL (Photo Credit : BCCI)

IND vs SL : ఇది టీమిండియా బి జట్టు అన్నారు.. ఐపీఎల్ కు మాత్రమే పనికి వచ్చే జట్టు అన్నారు. కానీ, ఆ మాటల్ని లెక్క చేయకుండా బరిలోకి దిగి తడాఖా చూపించింది గబ్బర్ సేన. కుర్రాళ్లు తొడ గొట్టి మరీ.. లంక టీమ్ ను చిత్తు చేశారు.

  • Share this:
    శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా బోణీ కొట్టింది. భారత్ చేతిలో శ్రీలంక టీమ్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. మరో 80 బంతులు మిగిలుండగానే ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్నందుకుంది. భారత్ 36.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి తమ లక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా కుర్రాళ్లందరూ తలో ఓ చెయ్యి వేశారు. తమకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కెప్టెన్ శిఖర్ ధావన్ 95 బంతుల్లో 86 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్ కిషన్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. తన అరంగేట్ర వన్డేలోనే హాఫ్ సెంచరీ బాదాడు ఈ కుర్రాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ అరంగేట్రంలోనే అర్ధ శతకం (59; 42 బంతుల్లో 8x4, 2x6) సాధించాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో అరంగేట్రంలో వేగంగా అర్ధ శతకం చేసిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్యా 26 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. రోలాండ్ బుట్చేర్, జాన్ మోరిస్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతే గాక బర్త్ డే రోజు వన్డే అరంగేట్ర మ్యాచ్ లోనే అర్థసెంచరీ బాదిన తొలి ప్లేయర్ గా ఇషాన్ కిషన్ రికార్డు సాధించాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ 20 బంతుల్లో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మనీష్ పాండే 26 పరుగులతో ఫర్వాలేదనిపించినా అనవసరపు షాట్ కు యత్నించి ఔటయ్యాడు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ రెండు వికెట్లు తీయగా, లక్ష్మణ్ సందకన్ కి ఓ వికెట్ దక్కింది.

    శ్రీలంక సెట్ చేసిన 263 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు చక్కని శుభారంభం లభించింది. కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కలిసి ఆరంభించిన యువ ఓపెనర్ పృథ్వీ షా (43: 24 బంతుల్లో 9×4) వరుస ఫోర్లతో శ్రీలంక బౌలర్లకి కాసేపు చెమటలు పట్టించేశాడు. షా క్రీజులో ఉన్నంతసేపు వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. ఓ సమయంలో హ్యాట్రిక్ ఫోర్లు కూడా బాదాడు. అతడి దెబ్బకు 5 ఓవర్లలోనే స్కోరు 55 పరుగులు దాటింది. 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షా.. 9 ఫోర్లతో 43 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ధనంజయ వేసిన 5.3 ఓవర్‌కు భారీ షాట్‌ ఆడబోయి అవిష్క ఫెర్నాండో చేతికి చిక్కాడు. దాంతో భారత్‌ 58 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.


    ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్‌, ఫోర్‌గా మలిచాడు. కిషన్‌ కూడా హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. టీ20 మాదిరి ఆడుతూ శ్రీలంక బౌలర్లతో చెడుగుడు ఆడాడు. ఈ క్రమంలోనే 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో ఇషాన్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20, వన్డే ఫార్మాట్లలోనూ అరంగేట్రంలోనే హాఫ్‌ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే శతకొట్టేలా కనిపించిన కిషన్‌ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సందకన్‌ బౌలింగ్‌లో భానుకకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక, మరోవైపు ఆచి తూచి ఆడుతున్న టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. శిఖర్ ధావన్ కు అండగా పాండే, సూర్యకుమార్ యాదవ్ నిలిచారు. సూర్యకుమార్ యాదవ్ కూడా తన దైన శైలిలో చెలరేగాడు. క్లాసిక్ షాట్లతో అలరించాడు. దీంతో టీమిండియా విక్టరీ అందుకుంది. మూడు వన్డేల సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో నిలిచింది.
    Published by:Sridhar Reddy
    First published: