IND vs SL : తొలి వన్డేలో మీసం మెలేసిన గబ్బర్..రికార్డుల మోత..కోహ్లీ తర్వాత శిఖర్ ధావన్..

Shikhar Dhawan (BCCI)

IND vs SL : అనుభవం లేని యంగ్ గన్స్ తో అద్భుతం చేశాడు శిఖర్ ధావన్. శ్రీలంకను వారి సొంతగడ్డపైనే చిత్తు చేశాడు. ఈ క్రమంలో రికార్డుల మోత మోగించాడు గబ్బర్.

  • Share this:
    శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా బోణీ కొట్టింది. భారత్ చేతిలో శ్రీలంక టీమ్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. మరో 80 బంతులు మిగిలుండగానే ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్నందుకుంది. భారత్ 36.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి తమ లక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా కుర్రాళ్లందరూ తలో ఓ చెయ్యి వేశారు. తమకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కెప్టెన్ శిఖర్ ధావన్ 95 బంతుల్లో 86 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్ కిషన్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, ఈ మ్యాచ్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్ లో లేటు వయసులో జట్టు పగ్గాలు అందుకున్న భారత కెప్టెన్‌గా గబ్బర్ నిలిచాడు. 35 సంవత్సరాల 225వ రోజు ధావన్ టీమిండియా పగ్గాలు అందుకున్నాడు. దీంతో 1984లో తొలిసారిగా భారత జట్టుకు నాయకత్వం వహించిన మొహిందర్ అమర్‌నాథ్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. పాకిస్థాన్‌పై 34 సంవత్సరాల 37 రోజుల వయసులో అమర్‌నాథ్ తొలిసారిగా టీమిండియాకు నాయకత్వం వహించాడు. సయ్యద్ కిర్మానీ (33 సంవత్సరాల 353 రోజులు), అజిత్ వాడేకర్ (33 సంవత్సరాలు 103 రోజులు)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

    వన్డేల్లో భారత జట్టుకి నాయకత్వం వహించిన 25వ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. అంతే గాక, ఈ వన్డేలో 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వన్డేలో 6000 పరుగులు పూర్తి చేశాడు గబ్బర్. దీంతో 6000 వన్డే పరుగులు పూర్తి చేసిన 5వ భారత ఓపెనర్‌గా ధావన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. 10000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన 14వ భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇక 17 రన్స్ వ్యక్తిగత స్కోరు వద్ద.. శ్రీలంకపై 1000 పరుగులు పూర్తిచేశాడు. ఇన్నింగ్స్ పరంగా వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా నిలిచాడు.


    ఇక, ఆరు వేల వన్డే పరుగులు సాధించిన రెండో వేగవంతమైన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 136 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 6000 వన్డే పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 147 ఇన్నింగ్స్‌లలో 6000 వన్డే పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ధావన్ 139 వన్డే ఇన్నింగ్స్ ఆడి 5977 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో రెండో స్థానానికి దూసుకొచ్చాడు గబ్బర్. ఇలా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో టీమిండియా సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
    Published by:Sridhar Reddy
    First published: