Team India : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా (TEam India) పరిస్థితి దారుణంగా తయారైంది. టి20 ఫార్మాట్లో వరుసగా 12 మ్యాచ్ లు గెలిచిన తర్వాత.. వరుస పరాజయాలతో డీలా పడింది. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మొహమ్మద్ షమీ (Mohammed Shami) లాంటి ప్లేయర్లకు విశ్రాంతినివ్వడంతో.. యువ ప్లేయర్లతోనే సౌతాఫ్రికా (South Africa)తో టి20 సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. మొదట కేఎల్ రాహుల్ (KL Rahul) కెప్టెన్ గా అనుకున్నప్పటికీ.. గాయంతో అతడు చివరి నిమిషంలో తప్పుకున్నాడు. ఫలితంగా యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్ గా భారత్ ను నడిపిస్తున్నాడు. ఇక ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ ఓడి.. సిరీస్ ను చేజార్చుకునే పరిస్థితుల్లో నిలిచింది. సిరీస్ రేసులో ఉండాలంటే రేపు (మంగళవారం) వైజాగ్ వేదికగా జరిగే మూడో టి20లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి దాపురించింది.
తొలి టి20లో 211 పరుగులు చేసినా.. దానిని కాపాడుకోలేక భారత్ చిత్తయింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ బ్యాటింగ్ వికెట్ పై జరిగిందని.. ఇక రెండోసారి బౌలింగ్ చేసే సమయంలో డ్యూ ఉండటం వల్ల భారత బౌలర్లు అనుకున్నంత స్థాయిలో రాణించలేదని సరిపెట్టుకున్నాం. ఇక రెండో టి20 ఒడిశాలోని బారాబతి స్టేడియంలో జరిగింది. బారాబతి పిచ్ బౌలర్లకు స్వర్గధామం అని అందరికీ తెలుసు. ఇక మ్యాచ్ రోజు మబ్బులు ఉండటంతో డ్యూ సమస్య కూడా లేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కిందా మీదా పడుతూ 148 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు దిగగా.. వారికి భువనేశ్వర్ కుమార్ చుక్కలు చూపించాడు. ఫలితంగా 30 లోపే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయినా కూడా చివరకు టీమిండియా ఓటమి పక్షానే నిలిచింది. రెండు జట్లు కూడా ఒకే పిచ్ పై గంటల వ్యవధిలో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ఆడారు. సౌతాఫ్రికా అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టగా.. భారత్ మాత్రం రెండింటిలోనూ చేతులెత్తేసింది. అసలు తప్పు పిచ్ లో ఉందా..? లేక టీమిండియా ప్లేయర్లలో ఉందా? అనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న.
మ్యాచ్ జరిగిన విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే.. భారత బ్యాటర్లు అనవసరపు షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. ఇషాన్ కిషన్, రిషభ్ పంత్ అనవసరపు షాట్లకు అవుటైతే.. ఫుట్ వర్క్ లోపంతో హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ అవుటయ్యారు. ఇక రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక చివర్లో దినేశ్ కార్తీక్ ఆడటంతో భారత్ మంచి స్కోరును అదుకోగలిగింది. ఇక బౌలింగ్ లోనూ భువనేశ్వర్ కుమార్ మినహా మిగిలిన వారు తేలిపోయారు. భువనేశ్వర్ ఒక్కడే నాలుగు వికెట్లు తీస్తే మిగిలిన వారు కేవలం రెండు వికెట్లను మాత్రమే తీయగలిగారు. మ్యాచ్ లో స్పిన్నర్లు చహల్, అక్షర్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు. ఇదే రీతిలో మూడో టి20లోనూ ఆడితే భారత్ సిరీస్ ను రెండు మ్యాచ్ ల ముందుగానే కోల్పోవడం ఖాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Hardik Pandya, India, India vs South Africa, Rishabh Pant, Shreyas Iyer, South Africa, Team India