IND vs SL 3rd ODI : 2023లో విరాట్ కోహ్లీ (Virat Kohli) రెచ్చిపోతున్నాడు. గతేడాది జరిగిన ఆసియా కప్ (Asia Cup) 2022 నుంచి మునుపటి సెంచరీల ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. శతకాలను బాదడం మొదలు పెట్టాడు. శ్రీలంక (Sri Lanka)తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ బాది ఈ ఏడాది తొలి సెంచరీని నమోదు చేసిన కోహ్లీ.. తాజాగా మరో ట్రిపుల్ ఫిగర్ ను అందుకున్నాడు. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో కింగ్ కోహ్లీ (110 బంతుల్లో 166 నాటౌట్; 8 సిక్సర్లు, 13 ఫోర్లు) శతకంతో విశ్వరూపం ప్రదర్శించాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. కోహ్లీకి తోడు శుబ్ మన్ గిల్ (97 బంతుల్లో 116; 14 ఫోర్లు; 2 సిక్సర్లు) కూడా సెంచరీ బాదేశాడు. దాంతో భారత్ భారీ టార్గెట్ ను శ్రీలంక ముందు ఉంచింది. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార, కాసున్ రజిత చెరో రెండు వికెట్లు తీశారు.
వన్ మ్యాన్ షో
తొలి వన్డేలో సెంచరీతో ఈ ఏడాది గొప్పగా ఆరంభించిన కోహ్లీ.. రెండో వన్డేలో మాత్రం నిరాశ పరిచాడు. అయితే మూడో వన్డేలో మాత్రం రెచ్చిపోయాడు. పాత కోహ్లీకి గుర్తు చేసేలా కళ్లు చెదిరే షాట్లతో రెచ్చిపోయాడు. కవర్స్ మీదుగా కోహ్లీ కొట్టిన ఫోర్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ను వర్ణించడానికి పదాలను వెతుక్కోవాల్సిందే. అంత గొప్పగా కోహ్లీ తన బ్యాట్ నుంచి పరుగుల వరద పారించాడు. గ్రౌండ్ నలువైపులా క్లాస్ గా చెమట పట్టకుండా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డు వేగం పెంచాడు. కోహ్లీకి ఇది 46వ అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) ఉన్నాడు. మరో మూడు శతకాలు బాదితే కోహ్లీ సచిన్ రికార్డును సమం చేయడం ఖాయం.
అంతకుముందు శుబ్ మన్ గిల్ కూడా రెచ్చిపోయి ఆడాడు. ఓపెనింగ్ స్థానం కోసం ఇషాన్ కిషన్ తో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో క్లాస్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. గిల్ కు ఇది అంతర్జాతీయ వన్డేల్లో రెండో సెంచరీ కావడం విశేషం. రోహిత్ శర్మ (49 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనపించాడు.
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్, కుల్దీప్
శ్రీలంక
దాసున్ శనక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, నువనిందు ఫెర్నాండో, కుశాల్ మెండీస్, అసలంక, యాషెన్ బండార, హసరంగ, కరుణరత్నే, వండర్సె, రజిత, లహిరు కుమార
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, India vs srilanka, KL Rahul, Rohit sharma, Team India, Virat kohli