శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాట్స్మెన్ తడబడ్డారు. వర్షం కారణంగా ఆగిన తిరిగి ప్రారంభమైన ఈ మ్యాచ్లో టీమిండియా 43.1 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక టార్గెట్ 226 పరుగులు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 47 ఓవర్లకు కుదించారు. దీంతో నిర్ణీత ఓవర్లు ఆటకుండానే పెవిలియన్ బాట పట్టారు టీమిండియా ప్లేయర్లు. పృథ్వీ షా 49 పరుగులు, సంజూ శామ్సన్ 46 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 40 పరుగులతో రాణించారు. మిగతా బ్యాట్స్ మన్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. లంక బౌలర్లలో ప్రవీణ్ జయవిక్రమ, అఖిల ధనంజయ చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు. దుష్యమంతా చమీరా కు రెండు వికెట్లు దక్కాయ్.
మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో ఏకంగా ఐదుగురు ప్లేయర్స్ భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేశారు. వికెట్ కీపర్ సంజు శాంసన్, బ్యాట్స్మన్ నితీశ్ రాణా, పేసర్ చేతన్ సకారియా, ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్, స్పిన్నర్ రాహుల్ చహర్ తమ తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్నారు. దీంతో భారత్ ఓ రికార్డు నెలకొల్పింది. ఇలా ఒకే మ్యాచ్లో ఐదుగురు ప్లేయర్స్ భారత్ తరఫున అరంగేట్రం చేయడం 41 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 1980-81లో ఇలా ఒకే వన్డేలో ఐదుగురు కొత్త వాళ్లకు తొలిసారి టీమిండియా అవకాశం ఇచ్చింది.
టీమిండియాకు సరైన ఆరంభం దక్కలేదు. 28 పరుగులు వద్ద కెప్టెన్ శిఖర్ ధావన్ ఔట్ అయ్యాడు. చమీర బౌలింగ్లో భనుకకు క్యాచ్ ఇచ్చి గబ్బర్ పెవిలియన్ చేరాడు. 11 బంతులు ఆడిన ధావన్ 3 ఫోర్లతో 11 పరుగులు చేశాడు. ధావన్ పెవిలియన్ చేరినా.. యువ ఓపెనర్ పృథ్వీ షా (49, 49 బంతుల్లో 8x4) చెలరేగాడు. అతడికి సంజు శాంసన్ (46, 46 బంతుల్లో 5x4, 1x6) కూడా సహకరించాడు. ఇద్దరూ ధాటిగా ఆడడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో షా ఔట్ అయ్యాడు. ఆపై శాంసన్ కూడా ఔట్ అయ్యాడు.
సూర్యకుమార్, మనీశ్ పాండేలు లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. సూర్య-మనీశ్ 29 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సమయంలో మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించింది. 23 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ను అంపైర్లు నిలిపివేశారు. 23 ఓవర్లలో భారత్ మూడు నష్టానికి 147 పరుగులు చేసింది. అయితే, తిరిగి ప్రారంభమైన తర్వాత లంక బౌలర్లు చెలరేగారు. దీంతో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరోమారు విఫలమయ్యాడు. 19 పరుగులు మాత్రమే చేసి జయవిక్రమ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులో పాతుకుపోయినట్టు కనిపించిన సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత కాసేపటికే దనంజయ బౌలింగులో ఎల్బీగా వెనుదిరిగాడు. 37 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ 7 ఫోర్లతో 40 పరుగులు చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs srilanka, Prithvi shaw, Sanju Samson, Shikhar Dhawan