IND vs SL 3rd ODI : మూడో వన్డేలో శ్రీలంక (Sri Lanka) పూర్తిగా తడబడింది. మొదట బౌలింగ్ లో చేతులెత్తేసిన శ్రీలంక.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ విఫలం అయ్యింది. దాంతో తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా (Team India) 317 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో సిరీస్ ను 3-0తో వైట్ వాష్ చేసింది. 391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులను భారత్ 73 పరుగులకే కుప్పకూల్చింది. శ్రీలంక 22 ఓవర్లలో 9 వికెట్లకు 73 పరుగులు మాత్రమే చేసింది. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ యాషెన్ బండార బ్యాటింగ్ చేసేందుకు రాలేదు. భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 4 వికెట్లతో అదరగొట్టాడు. మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను సిరాజ్ ఆరంభంలోనే చావు దెబ్బ తీశాడు. వరుస పెట్టి వికెట్లను తీశాడు. దాంతో శ్రీలంక ఏ దశలోనూ లక్ష్యం వైపు కదల్లేదు. నువనిందు ఫెర్నాండో చేసిన 19 పరుగులు శ్రీలంక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు కావడం విశేషం. కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును చేరుకున్నారు. మిగిలిన ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.
అంతకుముందు కింగ్ విరాట్ కోహ్లీ (110 బంతుల్లో 166 నాటౌట్; 8 సిక్సర్లు, 13 ఫోర్లు) శతకంతో విశ్వరూపం ప్రదర్శించాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. కోహ్లీకి తోడు శుబ్ మన్ గిల్ (97 బంతుల్లో 116; 14 ఫోర్లు; 2 సిక్సర్లు) కూడా సెంచరీ బాదేశాడు. దాంతో భారత్ భారీ టార్గెట్ ను శ్రీలంక ముందు ఉంచింది. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార, కాసున్ రజిత చెరో రెండు వికెట్లు తీశారు.
వన్ మ్యాన్ షో
తొలి వన్డేలో సెంచరీతో ఈ ఏడాది గొప్పగా ఆరంభించిన కోహ్లీ.. రెండో వన్డేలో మాత్రం నిరాశ పరిచాడు. అయితే మూడో వన్డేలో మాత్రం రెచ్చిపోయాడు. పాత కోహ్లీకి గుర్తు చేసేలా కళ్లు చెదిరే షాట్లతో రెచ్చిపోయాడు. కవర్స్ మీదుగా కోహ్లీ కొట్టిన ఫోర్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ను వర్ణించడానికి పదాలను వెతుక్కోవాల్సిందే. అంత గొప్పగా కోహ్లీ తన బ్యాట్ నుంచి పరుగుల వరద పారించాడు. గ్రౌండ్ నలువైపులా క్లాస్ గా చెమట పట్టకుండా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డు వేగం పెంచాడు. కోహ్లీకి ఇది 46వ అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) ఉన్నాడు. మరో మూడు శతకాలు బాదితే కోహ్లీ సచిన్ రికార్డును సమం చేయడం ఖాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs srilanka, Mohammed Shami, Mohammed Siraj, Rohit sharma, Shreyas Iyer, Sri Lanka, Virat kohli