30 ఏళ్ల కల సాకారం చేసుకోవాలని సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా (Team India)కు భంగపాటే ఎదురైంది. టెస్టు సిరీస్ లో 2-1 తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు మరో పరీక్షకు రెడీ అయింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ (IND vs SA ODI Series) జనవరి 19 నుంచి బోలాండ్ పార్క్ స్టేడియంలో ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ(Virat Kohli)ని కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత టీమిండియాకు ఇదే తొలి సిరీస్. విరాట్ స్థానంలో రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా అతడు వన్డే సిరీస్ కూడా దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) కు ఇది అగ్ని పరీక్ష లాంటిది. ఈ సిరీస్ కోసం భారత్ సన్నాహాలు ప్రారంభించింది. 2016 అక్టోబర్ తర్వాత ఏ ఫార్మాట్లోనైనా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కాకుండా ఫస్ట్ టైమ్ ఓ ప్లేయర్‌గా బరిలోకి దిగబోతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక, ఈ మ్యాచ్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ పలు కీలక విషయాలు వెల్లడించాడు.
వన్డే జట్టులో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ రూపంలో ముగ్గురు ఓపెనర్లు అందుబాటులో ఉండటంతో... తొలి వన్డేలో ఎవరెవరు ఓపెనర్లు ఆడతారు? అని కేఎల్ రాహుల్‌ని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. " నేను గత 14-15 నెలలుగా వన్డేల్లో నెం.4 లేదా నెం.5 స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. జట్టు అవసరాల్ని బట్టి.. నా బ్యాటింగ్ పొజీషన్ మారింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఒకవేళ రోహిత్ శర్మ ఈ జట్టులో ఉండి ఉంటే? నేను టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి ఉండేవాడ్ని. అతను లేడు కాబట్టి.. తొలి వన్డేకి ఓపెనర్‌గా ఆడతాను " అని రాహుల్ స్పష్టం చేశాడు.
కేఎల్ రాహుల్‌కి జోడీగా శిఖర్ ధావన్ ఓపెనర్‌గా తొలి వన్డేలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని పరోక్షంగా కేఎల్ రాహుల్ కూడా అంగీకరించాడు. " శిఖర్ ధావన్ చాలా అనుభవం ఉన్న ఓపెనర్. అతడి నుంచి జట్టు ఏం ఆశిస్తుందో అతను అర్థం చేసుకోవాలి. కెప్టెన్‌గా అతనికి సపోర్ట్ ఇచ్చి.. భారత్ జట్టు మెరుగైన స్కోరు చేసేందుకు సాయపడతా " అని రాహుల్ వెల్లడించాడు.
అంతేగాక.. ఐపీఎల్ హీరో వెంకటేష్ అయ్యర్ టీమిండియాకు చాలా కీలకమైన ఆటగాడు అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. భారత ఆరో బౌలర్‌కు వెంకటేష్ అయ్యర్ ప్రత్యామ్నాయమని, అందుకే అతనికి అవకాశం కల్పిస్తామని చెప్పాడు. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, " వైట్ బాల్లో ఆరో బౌలర్ చాలా కీలకం. ఇది మనకు చాలా కాలంగా తెలుసు. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు వెంకటేష్ అయ్యర్ వచ్చాడు. ఆయనకు తప్పక అవకాశం ఇస్తాం. వెంకటేష్ అయ్యర్‌కి ఏ అవకాశం ఇచ్చినా బాగానే ఆకట్టుకున్నాడు. మేం చాలా కీలకమైన ఆరో బౌలర్‌పై పని చేయాలనుకుంటున్నాం. వెంకటేష్ అయ్యర్ దక్షిణాఫ్రికాతో వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నాడు " అని స్పష్టం చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.