IND VS SA ODI SERIES TEAM INDIA HEAD TO HEAD RECORDS AGAINST SOUTH AFRICA HERE FULL STATS SRD
Ind Vs Sa ODI Series : సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా చెలరేగేనా..? రికార్డులు ఏం చెబుతున్నాయ్..?
Team India
Ind Vs Sa ODI Series : టెస్టుల్లో టీమిండియాకి ఊహించని పరాభవం ఎదురైంది. 2-1 తేడాతో సిరీస్ ను కోల్పోయింది. దీంతో.. వన్డే సిరీస్ నెగ్గి ఆ లెక్కను సరిచేయాలని టీమిండియా భావిస్తోంది.
30 ఏళ్ల కల సాకారం చేసుకోవాలని సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా (Team India)కు భంగపాటే ఎదురైంది. టెస్టు సిరీస్ లో 2-1 తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు మరో పరీక్షకు రెడీ అయింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ (IND vs SA ODI Series) జనవరి 19 నుంచి బోలాండ్ పార్క్ స్టేడియంలో ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ (Virat Kohli)ని కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత టీమిండియాకు ఇదే తొలి సిరీస్. విరాట్ స్థానంలో రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా అతడు వన్డే సిరీస్ కూడా దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) కు ఇది అగ్ని పరీక్ష లాంటిది. ఈ సిరీస్ కోసం భారత్ సన్నాహాలు ప్రారంభించింది. 2016 అక్టోబర్ తర్వాత ఏ ఫార్మాట్లోనైనా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కాకుండా ఫస్ట్ టైమ్ ఓ ప్లేయర్‌గా బరిలోకి దిగబోతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దక్షిణాఫ్రికా పర్యటన భారత్‌కు ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. ఇప్పటివరుకు ఇరు జట్లు 84 సార్లు తలపడగా సౌతాఫ్రికాదే పై చేయి. 46 మ్యాచుల్లో సఫారీ టీమ్ నెగ్గగా.. 35 మ్యాచుల్లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఇక, సౌతాఫ్రికా గడ్డపై మనోళ్ల రికార్డులు అంతగా బాగా లేవు. సఫారీ గడ్డపై టీమిండియా 34 వన్డే మ్యాచులు ఆడితే.. కేవలం పదింట్లో మాత్రమే నెగ్గింది. సౌతాఫ్రికా ఏకంగా 22 మ్యాచుల్లో విజయం దక్కించుకుంది. మరో రెండు మ్యాచుల్లో ఫలితం తేలకుండానే రద్దయ్యాయ్.
అయితే .. 2017-18లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఈ పర్యటనలో, రెండు జట్ల మధ్య ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్ ను టీమిండియా 5-1తో గెలిచింది. దీంతో, ఈ సిరీస్ ఫలితాన్నే మరోసారి రిపీట్ చేయాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు.. టెస్టు, వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత విరాట్‌కి ఇదే తొలి సిరీస్. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ సెంచరీ చేసి 25 నెలలు గడిచాయి.
ఇటువంటి పరిస్థితుల్లో, కెప్టెన్సీ ఒత్తిడి నుంచి విముక్తి పొందిన కోహ్లీ ఎలా ఆడతాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత రెండేళ్లుగా 12 వన్డేల్లో 46.66 సగటుతో 560 రన్స్ చేశాడు. పైగా 2018 సౌతాఫ్రికా పర్యటనలో కోహ్లీ దుమ్మురేపాడు. మూడు మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీతో 286 రన్స్ చేశాడు. మళ్లీ అదే పెర్ఫామెన్స్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు రానున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.