హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA: టీమిండియాపై ఆ ఘనత సాధించిన ఐదో జట్టుగా సౌతాఫ్రికా.. ఫస్ట్ వన్డేలో నమోదైన రికార్డులివే!

IND vs SA: టీమిండియాపై ఆ ఘనత సాధించిన ఐదో జట్టుగా సౌతాఫ్రికా.. ఫస్ట్ వన్డేలో నమోదైన రికార్డులివే!

PC : BCCI

PC : BCCI

IND vs SA: ఉత్కంఠగా సాగిన సౌతాఫ్రికా, టీమిండియాల ఫస్ట్ వన్డే మ్యాచ్‌ మూడు అరుదైన రికార్డులకు వేదికైంది. ఈ రికార్డులు ఏంటో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ (India vs South Africa)ను టీమిండియా (Team India) ఓటమితో మొదలుపెట్టింది. గురువారం లక్నోలో జరిగిన మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇండియాపై తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ మూడు అరుదైన రికార్డులకు వేదికైంది. ఈ రికార్డులు ఏంటో చూద్దాం.

* ఇన్నింగ్స్ పరంగా వన్డేల్లో వేగంగా 500 పరుగులు చేసిన గిల్

గురువారం మ్యాచ్‌లో పరుగులు చేయడంలో శుభ్‌మన్‌ గిల్‌ విఫలమయ్యాడు. ఏడు బంతుల్లో కేవలం మూడు పరుగులే చేశాడు. అయినా భారతదేశం తరఫున అత్యంత వేగంగా 500 వన్డే పరుగులు చేసిన వ్యక్తిగా రికార్డ్‌ నెలకొల్పాడు. 10 వన్డే ఇన్నింగ్స్‌లలో గిల్‌ ఈ ఘనతను అందుకున్నాడు. 9 ఇన్నింగ్స్‌లో 499 పరుగులతో ఉన్న గిల్‌.. గురువారం 500 పరుగుల మైలురాయిని దాటాడు. 11 ఇన్నింగ్స్‌లో 500 మార్క్‌ను దాటిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ రికార్డును బద్దలు కొట్టాడు. గిల్ పది ఇన్నింగ్స్‌లలో 62.7 యావరేజ్‌, 104.4 స్ట్రైక్ రేట్‌తో 500కి పైగా పరుగులు సాధించాడు.

* భారత్‌పై 50 వన్డేలు నెగ్గిన దక్షిణాఫ్రికా

లక్నోలో గెలిచిన వన్డేతో ఇప్పటి వరకు ఇండియాపై దక్షిణాఫ్రికా 50 వన్డేలు గెలిచినట్లు అయింది. భారతదేశం, దక్షిణాఫ్రికా రెండూ 50 ఓవర్ల ఫార్మాట్‌లో 88 సార్లు తలపడ్డాయి. వాటిలో దక్షిణాఫ్రికా 50 మ్యాచుల్లో గెలిచింది. భారత్ 35 మ్యాచ్‌లు గెలవగా, మూడు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. దక్షిణాఫ్రికా ఇప్పుడు వన్డే చరిత్రలో కనీసం 50 సార్లు భారత్‌ను ఓడించిన ఐదో జట్టు అయింది. దక్షిణాఫ్రికాకు ముందు ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, వెస్టిండీస్, శ్రీలంక ఉన్నాయి.

* ఎక్కువ పరుగులు ఇచ్చిన లెఫ్ట్‌ ఆర్మ్‌ రిస్ట్ స్పిన్నర్‌ తబ్రైజ్ షమ్సీ

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్ తబ్రైజ్ షమ్సీ ఎనిమిది ఓవర్లలో 89 పరుగులు ఇచ్చాడు. దీంతో వన్డే మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చిన లెఫ్ట్ ఆర్మ్‌ రిస్ట్‌ స్పిన్నర్‌గా నిలిచాడు. 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగులు ఇచ్చిన భారత ఆటగాడు కుల్దీప్ యాదవ్ రికార్డ్‌ను తబ్రైజ్‌ షమ్సీ అధిగమించాడు.

* ఫస్ట్ వన్డేలో మిల్లర్‌, క్లాసెన్‌ ఇన్నింగ్స్‌ హైలెట్‌

వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. టాస్‌ గెలిచిన ఇండియా బౌలింగ్‌ ఎంచుకొంది. మ్యాచ్‌ మొదటి సగంలో ఇండియాకు శుభారంభం లభించింది. దక్షిణాఫ్రికా 22.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 110 పరుగులకు పరిమితం అయింది. చివరికి దక్షిణాఫ్రికా 249 పరుగులు చేయగలిగిందంటే డేవిడ్‌ మిల్లర్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ కారణమని చెప్పాలి.

డేవిడ్ మిల్లర్ 63 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ కూడా 65 బంతుల్లో 74 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఇద్దరూ అద్భుతమైన 139 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఎనిమిది ఓవర్లలో 2 వికెట్లు తీసి 35 పరుగులు ఇచ్చి శార్దూల్ ఠాకూర్ మెరుగ్గా రాణించాడు.

ఇది కూడా చదవండి : ఏమయ్యా బుమ్రా.. ఆ స్టార్ ప్లేయర్ లా ఆలోచించి ఉంటే ఇన్ని తిప్పలు ఉండేవి కాదుగా!

* శాంసన్‌ పోరాడినా తప్పని ఓటమి

250 టార్గెట్‌తో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియాకు మొదటి ఓవర్లలోనే గట్టి దెబ్బ తగిలింది. ఎనిమిది పరుగులకే ఓపెన్లు ఇద్దరూ పెవిలియన్‌ చేరారు. మొదటి మ్యాచ్‌ ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌ 48 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరినీ కేవలం ఏడు బంతుల వ్యవధిలోనే దక్షిణాఫ్రికా స్పిన్నర్లు ఔట్‌ చేశారు.

అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ 37 బంతుల్లో 50, సంజూ శాంసన్ 63 బంతుల్లో 86 నాటౌట్‌ భారత్‌ను విజయం వైపు మళ్లించారు. అయ్యర్ ఔట్ అయిన వెంటనే, ఠాకూర్ 31 బంతుల్లో 33 పరుగులు చేసి శాంసన్‌కు తోడుగా నిలిచాడు. అయినప్పటికీ సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటం, చివరి ఓవర్లలో వికెట్లను కోల్పోవడంతో ఇండియా విజయం సాధించలేకపోయింది. హెన్రిచ్ క్లాసెన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Cricket, IND Vs SA, India vs South Africa, Sanju Samson, Shikhar Dhawan, Shreyas Iyer, Team India

ఉత్తమ కథలు