IND VS SA FIRST TEST LIVE UPDATES VIRAT KOHLI WON THE TOSS AND OPT TO BAT FIRST HERE PLAYING XI OF TEAM INDIA SRD
Ind Vs Sa : టాస్ గెలిచిన భారత్.. మరోసారి తెలుగు ప్లేయర్ కు అన్యాయం..
Ind Vs Sa
Ind Vs Sa : సఫారీ రైడ్ కు రెడీ అయింది టీమిండియా. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను మట్టికరిపించిన టీమిండియా.. ఇప్పుడు సౌతాఫ్రికాను కూడా ఓడించి సత్తా చాటాలని భావిస్తోంది.
ఆదివారం నుంచి టీమిండియా (Team India) దక్షిణాఫ్రికా సఫారీకి (South Africa Vs India) రెడీ అయింది. ఈ మూడు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్ టీమిండియాకే కాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) కూడా చాలా కీలకం. భారత జట్టు ఇప్పటి వరకు సిరీస్ గెలవని ఏకైక దేశం దక్షిణాఫ్రికా. కెప్టెన్సీ వివాదాన్ని (Captaincy Rift) మర్చిపోయి కోహ్లీ.. ఆఫ్రికాలో భారత జట్టు చరిత్రను మార్చాలనుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో వన్డే-టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేరు. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లీ.. టాస్ గెలవగానే బ్యాటింగ్ కే మొగ్గు చూపాడు. విదేశాల్లో ముందుగా బ్యాటింగ్ చేసి భారీగా పరుగులు చేయడమే తమ బలమని, పిచ్ కూడా తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నాడు. సౌతాఫ్రికా గడ్డపై ఆడటం సవాల్‌తో కూడుకున్నదని, ప్రత్యర్థి జట్టు ఎప్పటికి బలంగానే ఉంటుందని, వారికి ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసున్నాడు.
ఈ మ్యాచ్‌కు అద్భుతంగా ప్రిపేరయ్యామని చెప్పాడు. ప్రాక్టీస్‌కు సెంటర్ వికెట్ దొరకడం అదృష్టమన్నాడు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలతో పాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీసుకున్నామని చెప్పాడు. ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ కూడా బరిలోకి దిగుతున్నాడని తెలిపాడు.
ఇక వరుసగా విఫలమవుతున్న సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలకు ఊహించినట్లుగానే అనుభవం పేరిట అవకాశం దక్కింది. దీంతో, శ్రేయస్ అయ్యర్, తెలుగు క్రికెటర్ హనుమ విహారిలకు చోటు దక్కలేదు. ఇటీవల భారత్ - ఏ పర్యటనలో హనుమ విహారీ అద్భుతంగా రాణించాడు. దీంతో, ఈ టూర్ లో తుది జట్టులో అతనికి చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ, తెలుగు ప్లేయర్ కు మరో సారి అన్యాయం చేశారు.
తొలి టెస్టుపై మొదటి రోజు నుంచే పైచేయి సాధించాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. 29 ఏళ్ల చెత్త రికార్డును చెరిపేసి.. సౌతాఫ్రికా గడ్డపై కూడా త్రివర్ణపతకాన్ని ఎగురవేయాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు, రాహుల్ ద్రావిడ్ కూడా ఇదే తొలి విదేశీ టెస్ట్ సిరీస్. హెడ్ కోచ్ గా తన మార్క్ చూపించాలని రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.