IND vs SA 4th T20 Series : సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా (Team India) అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ లో సత్తా చాటి.. ఆ తర్వాత బౌలింగ్ తో ప్రత్యర్థిని పడగొట్టి సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ల ో భాగంగా రాజ్ కోట్ వేదికగా జరిగిన నాలుగో టి20లో 82 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా (South Africa)పై భారత్ ఘనవిజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 16.5 ఓవర్లలో 9 వికెట్లకు 87 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ తెంబా బవుమా (8) గాయపడటంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అతడు మళ్లీ బ్యాటింగ్ కు రాలేదు. దాంతో భారత్ విజయం ఖాయం అయ్యింది. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. యుజువేంద్ర చహల్ రెండు వికెట్లు సాధించాడు. తాజా విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ 2-2తో సమం అయ్యింది. 19వ తేదీ బెంగళూరు వేదికగా జరిగే చివరి టి20 సిరీస్ విజేతను తేల్చనుంది.
టార్గెట్ మొదలు పెట్టిన సఫారీ జట్టును ఆరంభం నుంచే భారత బౌలర్లు బెదరగొట్టారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల కోసం ప్రొటీస్ జట్టు చెమటోడ్చాల్సి వచ్చింది. బవూమా మోచేతికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఇక ప్రిటోరియస్ తో సమన్వయ లోపం కారణంగా క్వింటన్ డికాక్ రనౌట్ గా వెనుదిరిగాడు. కాసేపటికే ప్రిటోరియస్ (0) పెవిలియన్ కు చేరాడు. క్లాసెన్ (8), మిల్లర్ (9) కూడా తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. మరో ఎండ్ లో కాసేపు ప్రతిఘటించిన డసెన్ (20) భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. దాంతో సౌతాఫ్రికా పరాజయం ఖాయం అయ్యింది. గత మూడు మ్యాచ్ ల్ల ో ఒక్క వికెట్ కూడా తీయని అవేశ్ ఖాన్ ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్లు తీయడం విశేషం.
అంతకుముందు దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో.. హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా ఆడటంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి 2 వికెట్లు తీశాడు. మార్కో యాన్సెన్, ప్రిటోరియస్, నోకియా, కేశవ్ మహరాజ్ తలా ఓ వికెట్ తీశారు. 20వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన కార్తీక్.. అంతర్జాతీయ టి20ల్లో తొలి అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. దినేశ్ కార్తీక్ కు ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ‘ అవార్డు లభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs South Africa, Rishabh Pant, Shreyas Iyer, South Africa, Team India