IND vs SA 4th T20I : దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) దంచి కొట్టాడు. పునరాగమనంలో తనకు లభిస్తోన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న దినేశ్ కార్తీక్ అదరగొడుతున్నాడు. ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా (South Africa)తో రాజ్ కోట్ వేదికగా జరుగుతోన్న నాలుగో టి20లో దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా ఆడటంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి 2 వికెట్లు తీశాడు. మార్కో యాన్సెన్, ప్రిటోరియస్, నోకియా, కేశవ్ మహరాజ్ తలా ఓ వికెట్ తీశారు.
సిరీస్ లో వెనుకబడి తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రిషభ్ పంత్ మరోసారి టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన బవుమా మరో మాటకు తావు లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పై ఉన్న పచ్చికను ఉపయోగించుకున్న సౌతాఫ్రికా బౌలర్లు టీమిండియా ఓపెనర్లను ముప్పుతిప్పలు పెట్టారు. గత మ్యాచ్ హీరోలు రుతురాజ్ గైక్వాడ్ (5), ఇషాన్ కిషన్ (27), శ్రేయస్ అయ్యర్ (4) వెంట వెంటనే పెవిలియన్ కు చేరారు. కెప్టెన్ రిషభ్ పంత్ (23 బంతుల్లో 17; 2 ఫోర్లు) మరోసారి నిరాశ పరిచాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ జట్టును ఆదుకున్నారు. వీరు తొలుత ఆచితూచి ఆడినా కుదురుకున్నాక స్వేచ్ఛగా బ్యాట్ ను ఝుళిపించారు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ రెచ్చిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించాడు. కార్తీక్ రెచ్చిపోతుంటే హార్దిక్ పాండ్యా ప్రేక్షకపాత్ర వహించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 65 పరుగులు జోడించారు. భారీ షాట్ కు ప్రయత్నించిన హార్దిక్ థర్డ్ మ్యాన్ దగ్గర షంసీ పట్టిన అద్భుత క్యాచ్ కు పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న దినేశ్ కార్తీక్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. 20వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన కార్తీక్.. అంతర్జాతీయ టి20ల్లో తొలి అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాతి బంతిని భారీ సిక్సర్ కొట్టబోయి పెవిలియన్ కు చేరాడు. చివరి బంతిని ఫోర్ బాదిన అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ను ముగించాడు.
తుది జట్లు
భారత్: రిషభ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్, హర్షల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, చహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, వాన్ డెర్ డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్, మార్కో యాన్సెన్, లుంగీ ఎంగిడీ, కేశవ్, నోర్జే, షమ్సీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs South Africa, Rishabh Pant, Team India