P Anand Mohan, Visakhapatnam, News18
ప్రపంచ క్రికెట్ (World Cricket)లో భారత్(Team India)కు విశేష స్థానముంటే... విశాఖ(Vizag)కు ప్రత్యేక స్థానం ఉంది. టీమిండియాకు ఇది కలిసొచ్చిన ప్రాంతంగా గుర్తింపు పొందడమే కాకుండా కొందరు క్రికెటర్లను స్టార్స్‌ను చేసిన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు రెండు టెస్టులు, 15 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన నగరంలో టీమిండియా 90 శాతం విజయాలను నమోదు చేసింది. టెస్టు, వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో ఇక్కడ భారత్దేపై చేయి. ఈనెల 14న ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య జరిగే అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు విశాఖ మరోసారి ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
విశాఖలో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ కు వేదికగా నిలిచిన ఘనత ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్ స్టేడియానికి దక్కుతుంది. 1988, డిసెంబరు 10న భారత్, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ వన్డే మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.
ఆ తర్వాత 1994, నవంబరు 4న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా నాలుగు పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకున్నది. విల్స్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా 1996లో ఆస్ర్టేలియా-కెన్యా, 1999లో పెప్సీ కప్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్- శ్రీలంక జట్లు ఇక్కడ వన్డే మ్యాచ్‌లు ఆడాయి. చివరిగా 2001, ఏప్రిల్ 3న భారత్, ఆస్ర్టేలియా మధ్య జరిగిన వన్డేలో భారత్ ఓటమి పాలయింది.
పోతిన మల్లయ్యపాలెంలో నిర్మించిన ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ప్రస్థానం దాయాదుల (పాకిస్థాన్) పోరుతో ప్రారంభమయింది. 2005, ఏప్రిల్ 5న ఈ రెండు జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా పాక్‌ను చిత్తు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు (ఏసీఏ) ఏకైక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇదే కావడంతో బీసీసీఐ కేటాయించే మ్యాచ్‌లకు వేదికగా నిలిచింది.
2005లో తొలి వన్డేకు... .2012, సెప్టెంబరు 8న తొలి టీ20 మ్యాచ్‌కు....2016 నవంబరు 17 నుంచి 21 వరకు తొలి టెస్టు మ్యాచ్‌కు వేదికైన ఈ స్టేడియంలో ఇప్పటివరకు రెండు టెస్టులు, పది వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఈనెల 14న భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే టీ20 మ్యాచ్‌కు మరోసారి వేదికగా నిలిచింది.
విశాఖలో సెంచరీ వీరులు
భారత్ ఆటగాళ్లలో నవజ్యోతి సింగ్ సిద్ధు (103), రోహిత్‌శర్మ (159), విరాట్ కోహ్లీ (157 నాటౌట్), ధోనీ (148), కోహ్లీ (118), కోహ్లి (117), కేఎల్ రాహుల్ (102), శిఖర్‌ధావన్ (100 నాటౌట్) సెంచరీలు నమోదు చేయగా, ఆస్ర్టేలియా ఆటగాళ్లలో మార్క్ వా (128), రికీ పాంటింగ్ (109), మాథ్యూ హెడెన్ (113), మైఖేల్ క్లార్క్ (111 నాటౌట్)....శ్రీలంక క్రికెటర్ చమర సిల్వ (107 నాటౌట్), వెస్టిండీస్ ఆటగాడు హోప్ (123 నాటౌట్) సెంచరీలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IND Vs SA, India vs South Africa, Team India, Visakhapatnam