IND vs SA : సిరీస్ లో నిలవలాంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా (Team India) తొడగొట్టింది. బౌలింగ్ లో యుజువేంద్ర చహల్ (yuzvendra chahal), హర్షల్ పటేల్ (Harshal Patel) సత్తా చాటడంతో వైజాగ్ వేదికగా సౌతాఫ్రికా (South Africa)తో జరిగిన మూడో టి20 భారత్ 48 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. దాంతో ఐదు మ్యాచ్ ల టి2 సిరీస్ లో బోణీ కొట్టింది. 180 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను హర్షల్ పటేల్ నాలుగు వికెట్లతో చహల్ మూడు వికెట్లతో దెబ్బ తీశారు. దాంతో సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్ హీరో హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఛేజింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికాను ఆరంభం నుంచే భారత బౌలర్లకు లక్ష్యం వైపు వెళ్లకుండా కట్టడి చేశారు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దాంతో ఒత్తిడిలోకి వెళ్లిన సౌతాఫ్రికా కెప్టన్ బవుమా (8) షాట్ ఆడే క్రమంలో మిడాన్ లో అవేశ్ ఖాన్ చేతికి చిక్కాడు. మరికాసేపటికే మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (23)ను హర్షల్ పటేల్ పెవిలియన్ కు పంపాడు. గత రెండు మ్యాచ్ ల్లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్న యుజువేంద్ర చహల్.. బౌలింగ్ కు వచ్చీ రావడంతోనే ప్రిటోరియస్ (20), రస్సీ వాన్ డెర్ డసెన్ (1)లతో పాటు గత మ్యాచ్ హీరో క్లాసెన్ వికెట్ లను తీశాడు. ఇక కీలకమైన డేవిడ్ మిల్లర్ (1)ను స్లో డెలివరీతో హర్షల్ పటేల్ పెవలియన్ కు చేర్చాడు. దాంతో సౌతాఫ్రికా కథ ముగిసింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (35 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. టాస్ నెగ్గిన బవుమా మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. క్రీజులోకి వచ్చిన రుతురాజ్, ఇషాన్ కిషన్ ఆరభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ అద్బుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్ లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా సత్తా చాటడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. పవర్ ప్లేలో 57 పరుగులు సాధించిన టీ మిండియా.. 10 ఓవర్లు మగిసే సరికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. 10వ ఓవర్ ఆఖరి బంతికి రుతురాజ్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (14) రెండు సిక్సర్లు బాదిన తర్వాత పెవిలియన్ కు చేరగా.. వెంట వెంటనే ఇషాన్ కిషన్, పంత్ (6) పెవిలియన్ కు చేరాడు. దాంతో పరుగులు రావడం చాలా కష్టంగా మారింది. దినేశ్ కార్తీక్ (6) విఫలమయ్యాడు. చివర్లో హార్దిక్ పాండ్యా బౌండరీలు సాధించడంతో మెరుగైన స్కోరును సాధించగలిగింది. ఓపెనర్లు శుభారంభం చేయడంతో భారత్ 200 మార్కును చేరుకుంటుందని అంతా అనుకున్నా దానికి 21 పరుగుల దూరంలోనే భారత్ ఆగిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Hardik Pandya, India, India vs South Africa, Rishabh Pant, Shreyas Iyer, South Africa, Team India